Telugu Global
Telangana

కేటీఆర్ కి కూడా 'యాపిల్' మెసేజ్.. ఆయన రియాక్షన్ ఏంటంటే..?

అధికార పార్టీ నేతలు కూడా ఐ ఫోన్లు వాడుతుంటారు, వారి ఫోన్లకు ఇలాంటి మెసేజ్ లు వచ్చిన ఉదాహరణలు లేవు. దీంతో ఇది కచ్చితంగా ప్రతిపక్షాలపై కేంద్రం పన్నిన కుట్ర అంటూ ప్రచారం మొదలైంది.

కేటీఆర్ కి కూడా యాపిల్ మెసేజ్.. ఆయన రియాక్షన్ ఏంటంటే..?
X

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. యాపిల్ సంస్థ తమ ఐ ఫోన్ వినియోగదారులకు పంపించిన మెసేజ్ లు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. స్టేట్‌ స్పాన్సర్డ్‌ అటాకర్స్‌ మీ ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారు జాగ్రత్త అంటూ వందలాది మందికి మెసేజ్ లు పంపించింది యాపిల్ సంస్థ. అందులో ప్రతిపక్ష నేతలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో కేంద్రం తమ ఫోన్లపై నిఘా పెట్టిందంటూ వారంతా మండిపడుతున్నారు. తెలంగాణలో కూడా ఈ మెసేజ్ లు కలకలం సృష్టించాయి. తన ఫోన్ కి కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందని స్క్రీన్ షాట్ ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్.


దిగజారడమే వారి లక్ష్యం..

ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడానికి బీజేపీ ఎంతటి స్థాయికైనా దిగజారుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. ఆ విషయం మనకు తెలుసు కాబట్టి ఇలాంటి మెసేజ్ లు మనకు ఆశ్చర్యాన్ని కలిగించవని చెప్పారు. మంత్రి కేటీఆర్ తో పాటు.. దేశవ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. కేంద్రం తమ ఫోన్లను హ్యాక్ చేస్తోందన్నారు. దీనికి కేంద్రం కూడా ధీటుగా సమాధానం చెప్పినా వారి వివరణలో అంత పసలేదు. అధికార పార్టీ నేతలు కూడా యాపిల్ ఐ ఫోన్లు వాడుతుంటారు, వారి ఫోన్లకు ఇలాంటి మెసేజ్ లు వచ్చిన ఉదాహరణలు లేవు. దీంతో ఇది కచ్చితంగా ప్రతిపక్షాలపై కేంద్రం పన్నిన కుట్ర అంటూ ప్రచారం మొదలైంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్న వేళ.. ఈ మెసేజ్ లు ఆయా రాష్ట్రాల్లో కలకలం రేపాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వ్యతిరేక గళం వినిపిస్తే.. వారిని అణగదొక్కడానికి ప్రభుత్వం ఇలాంటి కుట్రలు పన్నుతోందని అంటున్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించుకోవడంతోపాటు.. టెక్నాలజీని కూడా వాడుకుంటూ ప్రతిపక్షాలను కేంద్రం టార్గెట్ చేస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి.


First Published:  1 Nov 2023 2:14 PM IST
Next Story