రాజు కాంగ్రెస్ పార్టీనే.. ఇంతకంటే ప్రూఫ్స్ కావాలా రాహుల్? - కేటీఆర్
రాజు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని బీఆర్ఎస్ ఆరోపణలు చేయగా.. అతడికి కాంగ్రెస్ పార్టీకీ ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు ఖండించారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై నిన్న హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. సిద్ధిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనపై యూట్యూబ్ రిపోర్టర్ అయిన రాజు సెల్ఫీ తీసుకుంటానంటూ దగ్గరకు వచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. రాజు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని బీఆర్ఎస్ ఆరోపణలు చేయగా.. అతడికి కాంగ్రెస్ పార్టీకీ ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు ఖండించారు. కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. రాజు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తేనంటూ ఆధారాలను బయటపెట్టారు.
The Congress Goon who unleashed the murder attack on MP Prabhakar Reddy yesterday
— KTR (@KTRBRS) October 31, 2023
Do you need more proofs Rahul Gandhi ? pic.twitter.com/HceItfzvUL
నిందితుడు రాజు తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడినని పేర్కొంటూ చేసిన పోస్టును, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న రాజు ఫొటోను కేటీఆర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. నిందితుడు రాజు కాంగ్రెస్ పార్టీయేనని.. ఇంతకంటే ప్రూఫ్స్ కావాలా రాహుల్ గాంధీ? అంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే కత్తిపోటుకు గురైన ప్రభాకర్ రెడ్డికి మొదట గజ్వేల్‌లో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రెడ్డి చిన్న పేగుకు గాయం కావడంతో ఆస్పత్రి వైద్యులు ఆయనకు సర్జరీ చేశారు. మరో నాలుగు రోజులపాటు ప్రభాకర్ రెడ్డిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించనున్నారు.