బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశపడొద్దు -కేటీఆర్
రేవంత్ రెడ్డిని రైఫిల్ రెడ్డి అంటూ సెటైర్లు పేల్చారు కేటీఆర్. ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి కేసీఆర్ ను ఓడిస్తాడంట అంటూ మండిపడ్డారు.
బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు, బిస్కెట్లకు ఆశ పడొద్దని.. కేసీఆర్ ని గెలిపించుకుని ధమ్ బిర్యానీ తిందామని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయండి అని సూచించారు. మోసాన్ని మోసంతోటే జయించాలని, ముల్లుని ముల్లుతోటే తియ్యాలని.. అందుకే ఆ పని చేయాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గం బిక్కనూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణపై ఆ పార్టీకి ప్రేమ లేదని వివరించారాయన. సోనియాను బలిదేవత అని రేవంత్ రెడ్డే అన్నారని, రాహుల్ చెప్పినట్టు దొరలకు, ప్రజలకు మధ్య జరిగే పోరాటమిదని గుర్తు చేశారు. ఢిల్లీ దొరలకు.. గల్లీ ప్రజలకు మధ్య ఎన్నికల పోరాటం జరుగుతోందన్నారు. ఢిల్లీ అహంకారం, ఢిల్లీ దొరలతో కొట్లాడటం తమకు కొత్తేమీ కాదన్నారు. తెలంగాణ ఇస్తామని 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకున్నాక చివరకు ఆ హామీ నెరవేర్చిందని చెప్పారు.
Live: కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్, రాజంపేట మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRBRS #KCROnceAgain #VoteForCar https://t.co/VqMCWo9vfB
— BRS Party (@BRSparty) November 1, 2023
కామారెడ్డి గురించే చర్చంతా..
కామారెడ్డి నియోజకవర్గం గురించే రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోందని చెప్పారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతోందన్నారు. కామారెడ్డి రైతుల కల నెరవేర్చడానికే ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈనెల 9న కేసీఆర్ నామినేషన్ వేయబోతున్నారని, ఆ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీలవాళ్లు పోటీ చేసేందుకే భయపడాలన్నారు.
రైఫిల్ రెడ్డీ నీకు సాధ్యమా..?
రేవంత్ రెడ్డిని రైఫిల్ రెడ్డి అంటూ సెటైర్లు పేల్చారు కేటీఆర్. ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి కేసీఆర్ ను ఓడిస్తాడంట అంటూ మండిపడ్డారు. కామారెడ్డిలో పోటీ చేస్తానని కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్షాలకు ఫ్యూజ్ లు ఎగిరిపోయాయన్నారు. అందుకే ఏదోదో మాట్లాడుతున్నారని చెప్పారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు లాగా కేసీఆర్ కామారెడ్డి వస్తున్నారని చెప్పారు.
♦