Telugu Global
Telangana

కేసీఆర్ ని చూస్తే ప్రతిపక్షాలకు అసూయ -కేటీఆర్

తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీలకు రూ. 100 కోట్ల అభివృద్ధి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

కేసీఆర్ ని చూస్తే ప్రతిపక్షాలకు అసూయ -కేటీఆర్
X

తెలంగాణ సీఎం కేసీఆర్ ని చూస్తే ప్రతిపక్షాలకు అసూయ అని అన్నారు మంత్రి కేటీఆర్. దానికి కారణం లేకపోలేదని, తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారని అందుకే వారికి అసూయ అని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ మినహా మరో పార్టీని అధికారంలోకి తేవాలని అనుకోరని వివరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ప్రగతి నివేదన సభకు కేటీఆర్ హాజరయ్యారు. స్థానికంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తుంగతుర్తిలో గాదరి కిషోర్ కి హ్యాట్రిక్ విజయం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


తుంగతుర్తిలో గతంలో 36,489 ఎకరాల ఆయకట్టు ఉండేదని, కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల లక్షన్నర ఎకరాలకు ఆయకట్టు పెరిగిందని చెప్పారు. రైతులంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ నియోజకవర్గంలో 49,130 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయని, దళిత బంధు ద్వారా 2,300 మందికి ఆర్థిక చేయూత అందించామని తెలిపారు. గతంలో జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య దారుణంగా ఉండేదని, కాంగ్రెస్ పాలకుల చేతగాని తనం వల్ల చాలామంది జీవచ్ఛవాల్లా మారిపోయారన్నారు. అలాంటి వాళ్ళను మళ్లీ నమ్మాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు పచ్చి మోసగాళ్ళని మండిపడ్డారు కేటీఆర్.

తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమల గిరి, మోత్కూర్ మున్సిపాలిటీలకు రూ. 100 కోట్ల అభివృద్ధి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. నియోజకవర్గంలో ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోయాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ ను 40 వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కి అండగా ఉండి ప్రజలు విజ్ఞత చూపించాలన్నారు.

First Published:  29 Jun 2023 9:19 PM IST
Next Story