Telugu Global
Telangana

యంగ్ వన్ లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

యంగ్ వన్ ఆధ్వర్యంలో మొత్తం 11 కర్మాగారాలు ఏర్పాటవుతాయని, 21వేలమందికి ఉపాధి లభిస్తుందని అన్నారు కేటీఆర్. 99శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని, అందులో 85శాతం వరకు మహిళలకే ఉపాధి దక్కేలా చేస్తామన్నారు

యంగ్ వన్ లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
X

వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో యంగ్ వన్ కంపెనీకి చెందిన ఎవర్ టాప్ టెక్స్ టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ETL) కోసం మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. కొరియా కంపెనీ యంగ్ వన్ ప్రతినిధులతో కలసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యంగ్ వన్ ఆధ్వర్యంలో మొత్తం 11 కర్మాగారాలు ఏర్పాటవుతాయని, 21వేలమందికి ఉపాధి లభిస్తుందని అన్నారు కేటీఆర్. 99శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని, అందులో 85శాతం వరకు మహిళలకే ఉపాధి దక్కేలా చేస్తామన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 60వేలమందికి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఉపాధి చూపిస్తుందని చెప్పారాయన.

ఫార్మ్ టు ఫ్యాషన్..

తెలంగాణలో మేలురకం పత్తి ఉత్పత్తి అవుతున్నందున ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. ఈ టెక్స్ టైల్ పార్క్ ద్వారా స్థానికులకు ఉపాధి, తెలంగాణ రైతాంగానికి మద్దతు ధర లభించడంతోపాటు, రాష్ట్రానికి అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. పొలం నుంచి పత్తి సేకరించడం మొదలుకొని, దాన్ని వస్త్రంగా తయారు చేసి ఫ్యాషన్ ప్రపంచానికి చేర్చే వరకు అన్నీ ఇక్కడే అందుబాటులో ఉంటాయన్నారు కేటీఆర్. అజాంజాహీ మిల్లు ద్వారా వరంగల్ కి ఎలాంటి పేరు వచ్చిందో.. అంతకంటే మంచి పేరు తీసుకొస్తామన్నారు.


పరీక్షా కాలంలో అండగా నిలబడాలి..

తెలంగాణ పనితీరు జనాభాకంటే 10రెట్లు ఎక్కువ అని, 30శాతం ఎక్కువ అవార్డులు తెలంగాణకు వచ్చాయని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇదంతా సీఎం కేసీఆర్ ముందుచూపు, అభివృద్ధి పథకాలతోనే సాధ్యమైందని వివరించారు. రైతుబంధు లాంటి విప్లవాత్మ కార్యక్రమాలు, దళితబంధు లాంటి దమ్మున్న పథకాలు... ప్రవేశ పెట్టడం కేసీఆర్ కే సాధ్యం అని చెప్పారు. మీకోసం మేం కష్టపడ్డాం, మాకు పరీక్షా కాలం వచ్చినప్పుడు మీరు అండగా నిలవాలి అని ప్రజలకు సూచించారు. కచ్చితంగా మూడోసారి మంచి ఫలితాలతో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేస్తుందని కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

First Published:  17 Jun 2023 1:31 PM IST
Next Story