Telugu Global
Telangana

కార్పొరేట్ కమలం వర్సెస్ గరీబోళ్ల గులాబీ..

చండూరును రెవెన్యూ డివిజన్‌ చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. కిష్టరాయిని పల్లి ప్రాజెక్టులను ఇప్పటికే 60 శాతం పూర్తి చేశామని, కొత్తగా ఏర్పడిన గట్టుప్పల్‌ మండలానికి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.

కార్పొరేట్ కమలం వర్సెస్ గరీబోళ్ల గులాబీ..
X

కార్పొరేట్‌ కమలానికి, గరీబోళ్ల గులాబీకి మధ్య జరుగుతున్న పోరుగా మునుగోడు ఉప ఎన్నికను అభివర్ణించారు మంత్రి కేటీఆర్. ప్రజలు ఎటువైపు ఉండాలో నిర్ణయించుకోవాలని చెప్పారు. కాసులు, కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారారని విమర్శించిన ఆయన.. గట్టుప్పల్ రోడ్ షో లో బీజేపీపై మరోసారి విరుచుకు పడ్డారు. 2018లో రాజగోపాల్‌ ను ఎమ్మెల్యేను చేస్తే నాలుగేళ్ల పాటు మునుగోడును అనాథను చేశారన్నారు. ఈ ఎన్నిక ప్రజలు కోరుకున్నది కాదని, వారిపై బలవంతంగా రుద్దిందని చెప్పారు. మూడున్నరేళ్ల పాటు బేరసారాలు చేసి, బేరం కుదిరాక రాజగోపాల్ జేపీలో చేరారన్నారు. అక్రమంగా వచ్చిన డబ్బుతో ఓటర్లను అంగడి సరకులా కొనాలని చూస్తున్నారని, ప్రజలెవరూ మోసపోవద్దని, రాజగోపాల్‌ రెడ్డి ఇచ్చే డబ్బులు, తులం బంగారం తీసుకొని టీఆర్ఎస్ కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్.

కోవర్ట్ కాక ఇంకెవరు..?

గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ని కోవర్ట్ రెడ్డి బ్రదర్స్ అంటూ కేటీఆర్ చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. తమను కోవర్ట్ లు అంటారా అంటూ అన్నదమ్ములిద్దరూ తెగ ఫీలయ్యారు. మరిప్పుడు కాంగ్రెస్ లో ఉంటూ, బీజేపీకి ఓటు వేయాలంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోవర్ట్ కాక ఇంకేమంటారని ప్రశ్నించారు కేటీఆర్.

రెవెన్యూ డివిజన్ గా చండూరు..

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడుని దత్తత తీసుకుంటానంటూ ఇటీవల ప్రకటించిన కేటీఆర్, తాజాగా చండూరును రెవెన్యూ డివిజన్‌ చేస్తామని హామీ ఇచ్చారు. కిష్టరాయిని పల్లి ప్రాజెక్టులను ఇప్పటికే 60 శాతం పూర్తి చేశామని, కొత్తగా ఏర్పడిన గట్టుప్పల్‌ మండలానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనను ఎన్నికల తర్వాత మొదలు పెడతామని చెప్పారు.

సిలిండర్ రేటు 2400 చేస్తారు జాగ్రత్త..

కాంగ్రెస్ హయాంలో 400 రూపాయలుగా ఉన్న గ్యాస్ సిలిండర్ రేటుని బీజేపీ వచ్చాక 1200రూపాయలు చేశారని, ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే సిలిండర్ రేటు 2400 చేస్తారని విమర్శించారు కేటీఆర్. బీజేపీని గెలిపిస్తే కేవలం కార్పొరేట్ కంపెనీలకు, కాంట్రాక్టర్లకే లాభం అని చెప్పారు. టీఆర్ఎస్ ని గెలిపించి గరీబోళ్ల గులాబీకి మద్దతు తెలపాలన్నారు.

First Published:  24 Oct 2022 8:00 AM IST
Next Story