Telugu Global
Telangana

ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి..

ప్రతి ఒక్కరూ "ముచ్చటగా..." ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు కేటీఆర్.

ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి..
X

"తెలంగాణలో జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి" అంటూ మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సరిగ్గా పోలింగ్ ప్రారంభమయ్యే సమయంలో ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు.. ఓటర్లను అలర్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. మీరు వేసే ఓటు తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలని ఆకాంక్షించారు కేటీఆర్.


"మీ ఓటు.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి" అంటూ తన ట్వీట్ ప్రారంభించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రైతుల జీవితాల్లో ఆ ఓటు వెలుగులు కొనసాగించాలని, వ్యవసాయ విప్లవానికి వెన్నెముకగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలు వేసే ఓటు మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలని, అదే సమయంలో యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయపాత్ర కావాలని చెప్పారు. ఈరోజు వేసే ఓటు సబ్బండ వర్ణాల్లో.. సంతోషాన్ని పదిల పరచాలని, తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా, సగర్వంగా ఎగరేసేదిగా ఉండాలని అన్నారు కేటీఆర్.

ఇది వజ్రాయుధం..

ప్రజల చేతిల్లో ఓటు వజ్రాయుధం అని దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కానివ్వొద్దని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్నితెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలంటే ప్రజలంతా ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతి ఒక్కరూ "ముచ్చటగా.." ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు కేటీఆర్.

*

First Published:  30 Nov 2023 7:28 AM IST
Next Story