Telugu Global
Telangana

బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకపోతే నష్టపోతారు జాగ్రత్త

ప్రభుత్వంలో స్థిరత్వం లేకపోతే ముందుగా దెబ్బతినేది పరిశ్రమలేనని పేర్కొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ కి అధికారమిస్తే స్థిరత్వంలేని ప్రభుత్వంతో అన్ని రంగాలు నాశనం అవుతాయని, ప్రధానంగా పారిశ్రామిక రంగం నష్టాలపాలవుతుందన్నారు.

బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకపోతే నష్టపోతారు జాగ్రత్త
X

స్థిరమైన ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశం అయిన ఆయన.. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని వివరించారు. భవిష్యత్తులో కూడా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పనిసరి అని చెప్పారు. సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వంతోనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు. ప్రభుత్వంలో స్థిరత్వం లేకపోతే ముందుగా దెబ్బతినేది పరిశ్రమలేనని పేర్కొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ కి అధికారమిస్తే స్థిరత్వంలేని ప్రభుత్వంతో అన్ని రంగాలు నాశనం అవుతాయని, ప్రధానంగా పారిశ్రామిక రంగం నష్టాలపాలవుతుందన్నారు.


హైదరాబాద్‌ శివార్లతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా ముందుకు వచ్చాయని వివరించారు కేటీఆర్. రాష్ట్రంలో వేరేవాళ్లు అధికారంలోకి వస్తే ప్రతిదానికి ఢిల్లీ వెళ్లి పర్మిషన్‌ తీసుకోవాలని, వారిని అన్ని రకాలుగా మెప్పించాల్సి వస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలకు అనుమతులు ఎంత సులభంగా వస్తున్నాయో అందరికీ తెలుసన్నారు. మౌలిక వసతుల విషయంలో కూడా ప్రభుత్వం ఉదారంగా ఉంటోందని, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తోందని చెప్పారు కేటీఆర్.

కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని అపోహలు ప్రచారంలోకి వచ్చాయని, లక్షకోట్ల అవినీతి అంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కేటీఆర్. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని వివరించారు. రూ.80వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌ గాంధీ ఆరోపించడం శోచనీయమన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఖర్చు రూ.1,839 కోట్లు అని.. అందులో రెండు పిల్లర్లు కుంగితే లక్ష కోట్లు మునిగినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు కేటీఆర్.

కొత్త ప్రాజెక్ట్ ల వల్లే సాగునీరు, తాగునీటి సమస్యలు తీరిపోయాయని, విద్యుత్ సమస్య లేనే లేదని అన్నారు కేటీఆర్. ఇవన్నీ రైతాంగానికే కాకుండా పారిశ్రామిక రంగానికి కూడా ఊతం ఇస్తాయని, అందుకే తెలంగాణ పారిశ్రామిక రంగంలో పురోగమిస్తోందన్నారు. ఈ పురోగతి కొనసాగాలా, ఆగిపోవాలా అనేది ప్రజల చేతుల్లోనే ఉందని చెప్పారు కేటీఆర్.

First Published:  9 Nov 2023 7:17 AM IST
Next Story