Telugu Global
Telangana

ఖైదీల క్షమాభిక్ష కోసం మంత్రి కేటీఆర్ కృషి..

వారి క్షమాభిక్ష పిటిషన్ ను దుబాయ్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ పైనే ఆశలు మిగిలి ఉన్నాయి. ఆయన క్షమాభిక్ష ప్రసాదిస్తేనే తెలంగాణ ఎన్నారై ఖైదీలకు ఉపశమనం లభిస్తుంది.

ఖైదీల క్షమాభిక్ష కోసం మంత్రి కేటీఆర్ కృషి..
X

దుబాయ్ లోని అవీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల విడుదల కోసం మంత్రి కేటీఆర్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా పలువురు ఖైదీల క్షమాభిక్షకోసం ఆయన ప్రయత్నించారు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల క్షమాభిక్ష ఆలస్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వ అధికారులు, వారి కేసు వాదిస్తున్న అరబ్బు లాయర్ తదితరులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు.


అసలేంటి కేసు..?

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేష్, శివరాత్రి హనుమంతు, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్ ఒక కేసులో అరెస్టై 15 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ నేరంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి.. దియ్య సొమ్ము (బ్లడ్ మనీ)అందిస్తే వారికి దుబాయ్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిస్తుంది. ఈ క్రమంలో నేపాల్ కి చెందిన బాధిత కుటుంబానికి 15 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని షరియా చట్టం ప్రకారం దియ్య సొమ్ముగా అందించారు. కానీ నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆ ఐదుగురికి ఇంకా క్షమాభిక్ష ప్రసాదించలేదు దుబాయ్ ప్రభుత్వం.

వారి క్షమాభిక్ష పిటిషన్ ను దుబాయ్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ పైనే ఆశలు మిగిలి ఉన్నాయి. ఆయన క్షమాభిక్ష ప్రసాదిస్తేనే తెలంగాణ ఎన్నారై ఖైదీలకు ఉపశమనం లభిస్తుంది. ఈ విషయంలో కాన్సుల్ జనరల్ కార్యాలయం చొరవ తీసుకోవాలని కోరారు మంత్రి కేటీఆర్. కాన్సుల్ జనరల్ రామ్ కుమార్ ని కలసి కేసు విషయంలో విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు జరిగిన బిజినెస్ సమావేశాల సందర్భంగా రాజ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన పలువురు వ్యాపారవేత్తలతో కూడా క్షమాభిక్ష విషయమై చర్చించారు మంత్రి కేటీఆర్. మానవతా దృక్పథంతో తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష కోసం సహకరించాలని కోరారు. దుబాయ్ ప్రభుత్వంతో ఈ విషయాన్ని చర్చించి, స్థానిక చట్టాల మేరకు క్షమాభిక్ష లభించేలా చూస్తామని వ్యాపారవేత్తలు మంత్రికి హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ పర్యటనతో మరోసారి ఖైదీల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి.

First Published:  6 Sept 2023 7:46 PM IST
Next Story