Telugu Global
Telangana

ప్రాణం పెట్టి చదివి.. ఉద్యోగాలు సాధించండి.. యువతకు కేటీఆర్ ఆత్మీయ లేఖ

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఒక సోదరుడిగా మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

ప్రాణం పెట్టి చదివి.. ఉద్యోగాలు సాధించండి.. యువతకు కేటీఆర్ ఆత్మీయ లేఖ
X

తెలంగాణ ప్రభుత్వం వేలాది ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. ప్రస్తుతం యువత ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆదివారం మంత్రి కేటీఆర్ ఓ ఆత్మీయ లేఖను రాశారు. 'మొలకెత్తే విత్తనం సర్దుకు పోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావా్ని అందిపుచ్చుకున్నది' అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక ఎత్తని.. ఇప్పుడు మరో ఎత్తు.. యువత ప్రాణం పెట్టి చదవి తల్లిదండ్రులు, నమ్ముకున్న ఆత్మీయుల స్వప్నాన్ని సాకారం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

'వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్న టీఆర్ఎస్ సర్కారు ఇవ్వాళ దేశంలో నవ శకానికి నాంది పలికింది. ఎన్నో ఆంక్షల నడుమ స్వరాష్ట్రంలో స్వపరిపాలనను మొదలు పెట్టి తొమ్మిది ఏండ్ల వ్యవధిలో సుమారు 2.25 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా దేశ చరిత్రను సరికొత్తగా లిఖించబోతుందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది' అన్నారు.

'ఉద్యమకాలంలో, అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను టీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా 1లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో విజయవంతంగా పూర్తి చేశాం. ప్రజల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి వచ్చాక, 90వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత నిబద్ధతతో వేగంగా చేపట్టాం. ఇప్పటికే సుమారు 32వేల పైచీలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చాం. గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నాం. మొత్తంగా రెండు లక్షల 25వేల పైచీలుకు ప్రభుత్వ ఉద్యోగాలను అతి తక్కువ సమయంలో భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది' అని పేర్కొన్నారు.

'ఇక ఉద్యోగాల భర్తీ విషయంలో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కాలన్న ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేశారు. అడ్డంకిగా ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించంతో ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆర్డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం దక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ తెచ్చిన జోనల్ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్పూర్తి ఫలించింది. దీంతో పాటు విద్యార్థులు, యువకుల కోరిక మేరకు ప్రభుత్వం వయో పరిమితిని సడలించింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పాల్గొనేందుకు మరింత మందికి అవకాశం దక్కింది' అన్నారు.

'నిరుద్యోగ యువత కోసం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే, ఏళ్ల తరబడి ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాం. త్వరలోనే మరో 10వేల మంది ఉద్యోగాలను కూడా క్రమబద్దీకరిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఉద్యోగ ప్రకటనల జారీతో పాటు వేగంగా వాటిని భర్తీ చేసేందుకు గతంలో లేని భిన్నమైన నియామక ప్రక్రియను మా ప్రభుత్వం అమలు చేస్తున్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో మాత్రమే కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల విద్యా సంస్థలతో ప్రత్యేక బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వికేంద్రీకరించాం. ఫలితంగా సంవత్సరాల పాటు సాగే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సమూలంగా మారి.. నియామకాలు వేగంగా జరుగుతున్నాయి.

తెలంగాణ ఏర్పడక ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు భర్తీ చేసిన ఉద్యోగాల నియామక ప్రక్రియపై సైతం ఎన్నో ఆరోపణలు, వివాదాలు నడిచాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతీ ఒక్క ఉద్యోగాన్ని అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని గర్వంగా చెప్పగలను. ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో గ్రూప్ వన్ ఉద్యోగాలలోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికాం. అందుకే ఇప్పటి వరకు మా ప్రభుత్వం నింపిన ఉద్యోగాల భర్తీలో పారదర్శకత అంశంపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. అందుకే గతానికి భిన్నంగా ఇప్పటి వరకు ఈ అంశంపై ఒక్క వివాదం నెలకొనలేదు' అని కేటీఆర్ వెల్లడించారు.

'కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా.. ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మా ప్రభుత్వం మెరుగు పరిచింది. ఇప్పటి దాకా సుమారు 17 లక్షల మందికి పైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత మన రాష్ట్రానిదే. ఇవే కాదు అద్భుతమైన ఆవిష్కరణల ఆలోచనలతో ఉన్న ఔత్సాహిక యువత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా స్టార్టప్ ఈకో సిస్టమ్‌ను తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉండేందుకు టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్, టీఎస్ఐసీ వంటి వేదికలను ఏర్పాటు చేసింది' అని అన్నారు.

'ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత స్థాయిలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత కోసం కోచింగ్ సెంటర్లను, ఇతర వసతులను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల తరపున నిరుద్యోగులకు శిక్షణా తరగతుల నిర్వహణ కూడా ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నది. నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే లైబ్రరీల బలోపేతానికి సైతం కొన్ని సంవత్సరాలుగా మా ప్రభుత్వం చేస్తున్న కృషి ఇవాళ ఫలించింది. నిరుద్యోగ యువత ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలి' అని కేటీఆర్ కోరారు.

'ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగ పర్వం నడుస్తున్నది. సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒక్కటే. పనికి మాలిన ప్రచారాలను పట్టించుకోకండి. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టండి. సానుకూల దృక్పథంతో సాధన చేసి, స్వప్నాలను సాకారం చేసుకోండి. కాలం తిరిగి రాదు. అవకాశాలను అందిపుచ్చుకోండి. ఏకాగ్రతతో అభ్యసించండి. లక్ష్యాన్ని చేరుకోండి' అని సూచించారు.

'దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు అత్యధిక జీతాలను చెల్లిస్తున్నది. ఆ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఆత్మ విశ్వాసం, పట్టుదల, ప్రణాళికతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించండి. ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోండి. ఇప్పటి దాకా ఒక ఎత్తు. ఇపపుడు ఒకెత్తు. ప్రాణం పెట్టి చదవండి. మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని నమ్ముకున్న ఆత్మీయుల స్వప్నాలను నిజం చేయండి. తెలంగాణ యువతకు ఆకాశమే హద్దని చాటండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఒక సోదరుడిగా మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను' అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

First Published:  4 Dec 2022 6:30 PM IST
Next Story