Telugu Global
Telangana

వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. అందులోనే అన్ని వివరాలు

మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. మిగిలిన కొలువుల భర్తీ ప్రక్రియ వెంటనే పూర్తి చేస్తామన్నారు. శిక్షణ కోసం మరిన్ని స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. అందులోనే అన్ని వివరాలు
X

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకాలు, ఉద్యోగాలు పొందినవారి వివరాలతో మంత్రి కేటీఆర్ www.telanganajobstats.in అనే వెబ్ సైట్ ని ప్రారంభించారు. ప్రజలకు నిజానిజాలు తెలిసేందుకే తాము ఈ వెబ్ సైట్ ప్రారంభించామని చెప్పారు మంత్రి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ.. రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు.

లక్ష ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి తాము హామీ ఇచ్చామని చెప్పారు మంత్రి కేటీఆర్. తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి, అందులో ఇప్పటికే 1.60 లక్షలకుపైగా భర్తీ చేశామని వివరించారు. తామిచ్చిన హామీ కంటే ఎక్కువగానే ఉద్యోగాల భర్తీ జరిగిందన్నారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్‌ హయాంలో భర్తీ అయిన ప్రభుత్వ ఉద్యోగాల సమాచారంతో రూపొందించిన ప్రత్యేక వెబ్‌ సైట్‌ ను కేటీఆర్‌ ప్రారంభించారు.

జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల యువతలో పలు అపోహలు నెలకొన్నాయని, వాటిని తొలగించేందుకే ఈ వెబ్ సైట్ ప్రారంభించామన్నారు. ఇందులోని వివరాలతో ప్రజలకు నిజం తెలుస్తుందన్నారు. ఇటీవల యువతతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో వారిలో ఉన్న అపోహలు, అనుమానాలు బయటపడ్డాయి. ఉద్యోగాల భర్తీపై సమాచారం ఇచ్చిన తర్వాత వారిలో సంతృప్తి వ్యక్తమైందని చెప్పారు కేటీఆర్.

మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. మిగిలిన కొలువుల భర్తీ ప్రక్రియ వెంటనే పూర్తి చేస్తామన్నారు. శిక్షణ కోసం మరిన్ని స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.


First Published:  22 Nov 2023 8:33 AM IST
Next Story