Telugu Global
Telangana

శంకరాచార్యులకు.. పీర్ల పండగకు ముడిపెట్టలేం

మహామహులు ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలితతోపాటు అనేకమంది సాధించలేనిది.. కేసీఆర్‌ సాధించబోతున్నారని, ఆయన హ్యాట్రిక్ సీఎం అవుతారని చెప్పారు కేటీఆర్.

శంకరాచార్యులకు.. పీర్ల పండగకు ముడిపెట్టలేం
X

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కి ముడిపెడుతూ జరుగుతున్న ప్రచారాన్ని మరోసారి ఖండించారు మంత్రి కేటీఆర్. బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీమ్‌ కాదని స్పష్టం చేశారు. శంకరాచార్యులకు.. పీర్లపండగకు ముడిపెట్టినట్టు.. బీజేపీతో బీఆర్‌ఎస్‌ ను జతచేయలేరని పునరుద్ఘాటించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీకి బీ టీమ్‌ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై తప్పుడు నివేదికలు ఎలా వస్తాయని కేటీఆర్‌ ప్రశ్నించారు. యూనిఫాం సివిల్‌ కోడ్‌, వ్యవసాయ బిల్లులను తాము వ్యతిరేకించామన్నారు. మోదీని ఫాసిస్ట్‌ అన్న మొదటి సీఎం కేసీఆరేనని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

హై కమాండ్, న్యూ కమాండ్, లో కమాండ్..

గతంలో కాంగ్రెస్ కి హై కమాండ్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు మూడు కమాండ్లు వచ్చాయని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. ఢిల్లీలో ఉన్నది హై కమాండ్‌ అని, బెంగళూరులో కొత్తగా న్యూ కమాండ్‌ పుట్టుకొచ్చిందని, హైదరాబాద్‌ లో లో కమాండ్‌ ఉందని అన్నారు. కాంగ్రెస్‌ టికెట్ల కోసం నేతలు ఢిల్లీ కంటే ఎక్కువగా బెంగళూరుకే వెళ్తున్నారని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ లో పాచిపోయిన పాత ముఖాలు తప్ప కొత్తదనమేమీలేదన్నారు కేటీఆర్.

ఏబుల్‌ లీడర్‌.. స్టేబుల్‌ గవర్నమెంట్‌ .

తెలంగాణలో హంగ్ ఏర్పడే ఛాన్సే లేదన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజలకు స్పష్టమైన తీర్పునివ్వడం అలవాటని, ఇప్పుడూ అదే జరుగుతుందని చెప్పారు. ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు అంతా ఒకే తరహా తీర్పునిస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. కేసీఆర్ ఏబుల్ లీడర్ అని, బీఆర్ఎస్ ప్రభుత్వం స్టేబుల్ గవర్నమెంట్ అని అన్నారు. మహామహులు ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలితతోపాటు అనేకమంది సాధించలేనిది.. కేసీఆర్‌ సాధించబోతున్నారని, ఆయన హ్యాట్రిక్ సీఎం అవుతారని చెప్పారు కేటీఆర్.

కాళేశ్వరంపై వస్తున్న విమర్శలను కూడా ఖండించారు కేటీఆర్. రూ. 80వేల కోట్లతో నిర్మిస్తే.. లక్షకోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా లిఫ్ట్‌ చేయకుండా నీళ్లు అందించలేమని, దీనికి మించిన మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. కృష్ణ, గోదావరి నదుల్లోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలన్నా.. మన వాటాను మనం వాడుకోవాలన్నా ఎత్తిపోతలకు మించిన మరో ప్రత్యామ్నాయంలేదని అన్నారు. కాళేశ్వరంపై ఇచ్చింది నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) రిపోర్ట్ కాదని అది NDA రిపోర్ట్ అని చెప్పారు కేటీఆర్.

First Published:  7 Nov 2023 11:58 AM IST
Next Story