ప్రజారవాణాపై మరింత దృష్టిపెడతాం.. మెట్రో రెండోదశపై కేటీఆర్ కీలక ప్రకటన
కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా మొదటి దశ మెట్రో పూర్తి చేసినట్టే, రెండో దశను కూడా పూర్తి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
హైదరాబాద్ లోనే అతి పొడవైన శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ కారిడార్ ని ఔటర్ రింగ్ రోడ్ తో అనుసంధానం చేస్తూ 250 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్ లో ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. నగరం విస్తరిస్తున్నందున ప్రజారవాణాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఎంఎంటీఎస్ కోసం రూ.200కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని, ఈ నిధులతో ఎంఎంటీఎస్ విస్తరణ చేపడతామన్నారు కేటీఆర్. మెట్రో రెండో దశకు సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని, సహకరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారాయన.
కేంద్రం సహకరించకపోయినా..
కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా మొదటి దశ మెట్రో పూర్తి చేసినట్టే, రెండో దశను కూడా పూర్తి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు 5 కిలోమీటర్లు, మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు కొత్తగా మెట్రో నిర్మించబోతున్నట్టు తెలిపారు. కరోనా కష్టాలు ఓవైపు, కేంద్రం సహాయ నిరాకరణ మరోవైపు.. ఇలా మెట్రో విస్తరణ సకాలంలో పూర్తి కాలేదని, రాబోయే రోజుల్లో దీనిపై మరింత దృష్టిపెడతామన్నారాయన.
అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. విద్యుత్ వ్యవస్థ, శాంతిభద్రతలు, భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్, మంచినీరు, రోడ్లు, అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ.. ఇలా అన్నిటిపై దృష్టిపెట్టామని చెప్పారు కేటీఆర్. తక్కువ వ్యవధిలోనే శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ నిర్మించిన సంస్థకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ లేదా జనవరిలో కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభిస్తామన్నారు. రాబోయే 9 నెలల్లో కొండాపూర్ ఫ్లైఓవర్ నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు.