కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం..!
తెలంగాణ వ్యవసాయ రంగంలో గత పదేళ్ల అనుభవాలను ఈ సమావేశంలో చర్చించడం వల్ల సమావేశాలకు హాజరవుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు టెర్రి ఈ బ్రాడ్ స్టాడ్.
మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం అందింది. గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని వివరించాలంటూ కేటీఆర్‌కు అంతర్జాతీయ స్థాయి ఆహ్వానం అందింది. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ పేరిట ఏర్పాటు చేసిన బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో మాట్లాడాలంటూ నిర్వాహకులు ఇన్విటేషన్ పంపారు.
అక్టోబర్ 24-26 మధ్య అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోని డెస్మోయినన్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ దేశాల నుంచి 1200 మంది అతిథులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన విస్తృతస్థాయి చర్చలను ఏటా ఈ సమావేశాల్లో నిర్వహిస్తారు.
తెలంగాణ వ్యవసాయ రంగంలో గత పదేళ్ల అనుభవాలను ఈ సమావేశంలో చర్చించడం వల్ల సమావేశాలకు హాజరవుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు టెర్రి ఈ బ్రాడ్ స్టాడ్. వ్యవసాయంలో సాధించిన ప్రగతి కోసం తెలంగాణ అనుసరించిన విధానాలు సమావేశంలో చర్చించడం ద్వారా ప్రపంచ ఆహార భద్రత, సరఫరాను పెంచడం, ప్రపంచ ఆహార కొరతను ఎదుర్కోవడం వంటి కీలకమైన అంశాల పట్ల ఒక విస్తృతమైన అవగాహన ఏర్పడుతుందన్నారు.