పాతబస్తీకి మెట్రో.. ఎప్పట్నుంచంటే..?
మెట్రో కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమ వరకు 4 మెట్రోస్టేషన్ల (సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్)తో అలైన్ మెంట్ ను ఖరారు చేశారు.
హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన మెట్రో రైలు ప్రజా జీవితంలో భాగంగా మారింది. ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల పొడవున మెట్రో మార్గం ఉంది. అయితే కొన్ని ప్రాంతాలకు ఇంకా మెట్రో చేరలేదు. అవి శివారు ప్రాంతాలు అనుకుంటే పొరపాటే. నగరం నడిబొడ్డున ఉన్న పాతబస్తీకి మెట్రో సౌకర్యం లేదు. కారణాలు చాలానే ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించే సాహసం చేయలేక ఎల్ అండ్ టి సంస్థ చేతులెత్తేసింది. పాతబస్తీ మినహా మిగతా ప్రాంతాల్లో మెట్రో పూర్తి చేసి విజయవంతంగా నడుపుతోంది. అయితే తాజాగా ఈ పాతబస్తీ మెట్రోపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ వేశారు.
"హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మెట్రో రైలు ప్రాజెక్టును వేగవంతంగా చేపట్టేందుకు ఎల్ అండ్ టి చైర్మన్ తో మాట్లాడి, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు." అంటూ కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు. దీంతో ఎంజీబీఎస్ - ఫలక్ నుమ రూట్ లో మెట్రో నిర్మాణానికి మార్గం సుగమం అయింది.
Hon’ble CM KCR has instructed the Municipal Administration department to take forward the Metro project in Old city of Hyderabad
— KTR (@KTRBRS) July 10, 2023
He also spoke to Chairman of L&T which is the agency executing the Metro Rail Project to expeditiously take up the project and promised all needed…
మెట్రో కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమ వరకు 4 మెట్రోస్టేషన్ల (సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్)తో అలైన్ మెంట్ ను ఖరారు చేశారు. సుమారు రూ.2వేల కోట్ల అంచనాతో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్), ఎల్ అండ్ టి సంస్థ తదుపరి చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు నివేదిక రూపొందించారు. నివేదిక తయారైనా అది ఇన్నాళ్లు సందిగ్ధంలోనే ఉంది. ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయంతో అది ముందుకు సాగుతుంది.
రాయదుర్గంతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా కలిపి సుమారు 2.7 కిలోమీటర్లు అదనంగా నిర్మించటంతో పాటు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమ వరకు 5.5 కిలోమీటర్ల మార్గాన్ని కూడా పూర్తి చేస్తే హైదరాబాద్ లో మెట్రో విస్తీర్ణం మరింత పెరుగుతుంది.