Telugu Global
Telangana

ఓట్లకోసం ఆ పని మాత్రం చేయను -కేటీఆర్

ఓట్ల కోసం నాయకులు ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌లు చైత‌న్యం ప్ర‌ద‌ర్శించాలన్నారు. ప‌ని చేసే ప్ర‌భుత్వాల‌ను ప్ర‌జ‌లు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.

ఓట్లకోసం ఆ పని మాత్రం చేయను -కేటీఆర్
X

"మీదయ ఉంటే గెలుస్తా, లేకుంటే ఇంట్లో కూర్చుంటా.. కానీ ఓట్లకోసం ఆపని మాత్రం చేయను" అని అన్నారు మంత్రి కేటీఆర్. గతంలో కూడా తాను ఓట్లకోసం మందు పోయించలేదని, డబ్బులు పంచి పెట్టలేదని, ఈసారి కూడా తాను డబ్బులు, మద్యం జోలికి పోకుండా నీతిగా ఎన్నికల్లో నిలబడతానని చెప్పారు. పైసలు పంచిపెట్టే చిల్లర రాజకీయం తాను చేయనన్నారు.

వేములవాడ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌రేట్‌ లో బీసీ బంధు ప‌థ‌కం చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు. ఓట్ల కోసం విప‌క్ష నేత‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌లు నిల‌దీయాలన్నారు. 50 సంవత్సరాలు పాలించి రాష్ట్రానికి ఏమీ చేయ‌లేని వారు ఇప్పుడేం చేస్తార‌ని ప్రశ్నించాలన్నారు. ఓట్ల కోసం నాయకులు ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌లు చైత‌న్యం ప్ర‌ద‌ర్శించాలన్నారు. ప‌ని చేసే ప్ర‌భుత్వాల‌ను ప్ర‌జ‌లు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.


వారిని నమ్మొద్దు..

ఓట్ల కోసం మందు పోయించి, పైస‌లు పంచేవారిని న‌మ్మొద్దని చెప్పారు కేటీఆర్. కేసీఆర్ సీఎంగా ఉన్నంత వ‌ర‌కు రాష్ట్రానికి ఢోకా లేదన్నారు. శ‌తాబ్దాలుగా సమాజంలో అత్యంత అట్ట‌డుగున ఉన్న‌ది ద‌ళితులేనని చెప్పారు. అందుకే ద‌ళితుల అభివృద్ధి కోసం రూ. 10 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. బీసీ, ఎంబీసీల్లోని 14 కుల‌వృత్తులు చేసుకునేవారికి ల‌క్ష రూపాయల సాయం అందిస్తున్నామని చెప్పారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల‌లో 600 మంది ల‌బ్దిదారుల‌కు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున సాయం చేసిన‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌తి నెల నియోజ‌క‌వ‌ర్గానికి 300 మంది చొప్పున ఒక్కొకరికి ల‌క్ష రూపాయల సాయం అందిస్తామని చెప్పారు. ద‌ళితులు, బీసీల‌కు అందిస్తున్నట్టే.. మైనార్టీల‌కు కూడా లక్ష రూపాయల ఆర్థిక సాయం త్వరలోనే అందుతుందని చెప్పారు కేటీఆర్. సెప్టెంబ‌ర్‌ లో సిరిసిల్ల‌లో మెడిక‌ల్ కాలేజీని సీఎం ప్రారంభిస్తారని చెప్పారు.

First Published:  8 Aug 2023 5:51 PM IST
Next Story