Telugu Global
Telangana

వెల్‌స్పన్ రాకతోనే ఇతర ఎంఎన్‌సీలు ఇక్కడ క్యూ కట్టాయి : మంత్రి కేటీఆర్

వెల్‌స్పన్ సంస్థ యూనిట్ పెట్టిన తర్వాతే అమెజాన్, కైటెక్స్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర సంస్థలు ఇక్కడ తమ క్యాంపస్‌లు ప్రారంభించాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

వెల్‌స్పన్ రాకతోనే ఇతర ఎంఎన్‌సీలు ఇక్కడ క్యూ కట్టాయి : మంత్రి కేటీఆర్
X

వెల్‌స్పన్ ఇక్కడ అడుగు పెట్టిన తర్వాతే ఇతర ప్రముఖ ఎంఎన్‌సీలు క్యూలు కట్టాయని తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన వెల్‌స్పన్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్ లిమిటెడ్ యూనిట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రిందట చందనవెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదు. కానీ రెండేళ్ల కిందట రూ.1500 కోట్లతో వెల్‌స్పన్ సంస్థ తొలి సారిగా యూనిట్ పెట్టిందన్నారు.

వెల్‌స్పన్ సంస్థ యూనిట్ పెట్టిన తర్వాతే అమెజాన్, కైటెక్స్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర సంస్థలు ఇక్కడ తమ క్యాంపస్‌లు ప్రారంభించాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్‌లో చందనవెల్లి తెలంగాణలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్‌గా మారుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో వెల్‌స్పన్ సంస్థ రూ.3వేల నుంచి రూ.5వేల కోట్ల వరకు పెట్టుబడి పెడతామని ప్రకటించినందుకు సంస్థ అధినేత బాలకృష్ణ గోయెంకకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవ్వాళ తాను ప్రారంభించిన యూనిట్ కోసం వెల్‌స్పన్ సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టిందని కేటీఆర్ వెల్లడించారు. వెల్‌స్పన్ యూనిట్లలో స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారని.. ఈ విషయంలో వారిని అభినందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. చందనవెల్లిలో తయారయ్యే ఉత్పత్తుల్లో సగం సిలికాన్ వ్యాలీకే వెళ్తాయని కేటీఆర్ వివరించారు. ఈ ప్రాంతానికి నీరు అందించడానికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని కేటీఆర్ అన్నారు. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. కానీ కాళేశ్వరం, మిషన్ భగీరథ తరహాలోనే సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తారని కేటీఆర్ వెల్లడించారు.

కాగా, రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టి చందనవెల్లిని వెల్‌స్పన్ వ్యాలీగా మారుస్తామని సంస్థ ఎండీ గోయెంకా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హ్యండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖ సెక్రటరీ బుద్దా ప్రకాశ్ జ్యోతి, వెల్‌స్పన్ జాయింట్ ఎండీ, సీఈవో దీపాలి గోయెంకా తదితరులు పాల్గొన్నారు.



First Published:  22 Feb 2023 10:59 AM GMT
Next Story