Telugu Global
Telangana

వద్ధులతో కలసి క్యారమ్స్ ఆడిన మంత్రి కేటీఆర్

వృద్ధుల సంరక్షణ కేంద్రంలో సౌకర్యాలు చాలా బాగున్నాయని పరిశీలించారు. రాష్ట్రంలో తొలి సంరక్షణ కేంద్రాన్ని సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.

వద్ధులతో కలసి క్యారమ్స్ ఆడిన మంత్రి కేటీఆర్
X

తెలంగాణ మంత్రి కేటీఆర్ వృద్ధులతో కలసి కాసేపు క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఆడారు. రాష్ట్రంలో తొలి సారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని నిర్మించారు. దీనిని మంగళవారం ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆ కేంద్రంలో ఉన్న డార్మిటరీ, డైనింగ్ హాల్, డాక్టర్-ఫిజియోథెరపీ రూమ్, గేమ్స్ రూమ్, గార్డెన్, యోగా షెడ్‌ను పరిశీంచారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

వృద్ధుల సంరక్షణ కేంద్రంలో సౌకర్యాలు చాలా బాగున్నాయని చెప్పారు. రాష్ట్రంలో తొలి సంరక్షణ కేంద్రాన్ని సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జీవితంలో మలిసంధ్య దశలో కుటుంబ ఆదరణకు నోచుకోలేక, నిలువు నీడలేక బాధపడుతున్న వృద్ధులకు ఈ సంరక్షణ కేంద్రం ఆసరాగా ఉంటుందని అన్నారు. చివరి దశలో ఆత్మగౌరవంగా బతికేందుకే ఈ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని చాలా ఉపయోగకరంగా తీర్చిదిద్దిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మంత్రి కేటీఆర్ అభినందించారు.



సంరక్షణ కేంద్రమంతా అంతా కలియతిరిగిన కేటీఆర్.. అక్కడ ఉన్న వృద్ధులను ఆప్యాయంగా పలుకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అందుతుందా అని ఆరా తీశారు. అక్కడి గేమ్స్ రూమ్‌లో కాసేపు టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ ఆడారు. కాగా, ఈ సంరక్షణ కేంద్రాన్ని రూ.40 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇందులో 25 బెడ్ల సామర్థ్యం ఉన్నది.

ఈ ప్రారంభోత్సవంలో.. జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఐజీ రమేష్ నాయుడు, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్ట‌ర్లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా విద్యాధికారి ఎ రమేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

First Published:  1 March 2023 6:39 AM IST
Next Story