Telugu Global
Telangana

ఒక్క ఛాన్స్ రాజకీయంతో ఆగమాగం.. కాంగ్రెస్ వలలో పడొద్దన్న కేటీఆర్

తొమ్మిదిన్నరేళ్లలో రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని, ఏడాది కాలం ఎన్నికలకు సరిపోయిందని, నికరంగా బీఆర్ఎస్ కి పనిచేసే అవకాశం వచ్చింది ఆరున్నరేళ్లేనని చెప్పారు మంత్రి కేటీఆర్. ఈ ఆరున్నరేళల్లో తెలంగాణను ఎలా మార్చుకున్నామో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.

ఒక్క ఛాన్స్ రాజకీయంతో ఆగమాగం.. కాంగ్రెస్ వలలో పడొద్దన్న కేటీఆర్
X

తెలంగాణ తలరాతను రాసే ఎన్నిక ఇది అని అన్నారు మంత్రి కేటీఆర్. ఇంట్లో ఆడబిడ్డకు పెళ్లి వయసు వస్తే ఎంత ఆలోచిస్తామో ఎన్నికల్లో ఓటు వేసేముందు కూడా అలాగే ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని, ఏడాది కాలం ఎన్నికలకు సరిపోయిందని, నికరంగా బీఆర్ఎస్ కి పనిచేసే అవకాశం వచ్చింది ఆరున్నరేళ్లేనని చెప్పారు. ఈ ఆరున్నరేళల్లో తెలంగాణను ఎలా మార్చుకున్నామో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. 200 రూపాయల పెన్షన్ 2వేల రూపాయలకు పెరిగిందన్నారు. బీడీ కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తున్నామని, మరింతమందికి ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ లాగా మోసపు హామీలిచ్చేవాళ్లం కాదని, బరాబర్ అర్హులందరికీ పెన్షన్ ఇస్తామన్నారు.


డిసెంబర్ 3 తర్వాత..

డిసెంబర్ 3 తర్వాత కొత్త పెన్షన్ కార్డ్ లు, కొత్త రేషన్ కార్డులు.. అందరికీ ఇప్పిస్తామన్నారు మంత్రి కేటీఆర్. పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ని పోగొట్టుకుందామా అని ప్రశ్నించారు. రెండు ఛాన్స్ లు మాకిచ్చారని, ఒక ఛాన్స్ కాంగ్రెస్ కి ఇద్దామని కొందరు అనుకుంటున్నారని.. మంచిగా కారు నడిపే డ్రైవర్ ని ఎవరైనా వద్దనుకుంటారా అని అన్నారు. 65 ఏళ్లు చావగొట్టినోడికి మళ్లీ అవకాశమిద్దామా అని అడిగారు. 3 గంటలు కరెంటు చాలు అని కాంగ్రెస్ నేతలు డైరెక్ట్ గా చెబుతున్నారని అలాంటి వారిని తెచ్చుకుందామా అని ప్రశ్నించారు కేటీఆర్. కరెంటు కోసం ఆగమవుదామా, ఎరువుల కోసం క్యూలో నిలబడదామా అన్నారు.

వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చల్మెడ లక్ష్మీనరసింహారావుకి ఈసారి బీఆర్ఎస్ అవకాశమిచ్చింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ప్రచారానికి రాకపోవడంతో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. అయితే ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి మహిళా నాయకురాలు తుల ఉమ తిరిగి బీఆర్ఎస్ లో చేరడంతో ఆ వర్గం ఓట్లు కూడా చెల్మెడకే అన్న భరోసా వచ్చింది. దీనికితోడు మంత్రి కేటీఆర్ కూడా ఇక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ లో తిరిగి ఊపువచ్చింది.

First Published:  15 Nov 2023 2:15 PM IST
Next Story