మావి సీదా రాజకీయాలు.. ప్రతిపక్షాలవి శిఖండి రాజకీయాలు
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోతల రాయుడని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. నల్గొండలో ఆయన చేయలేని పనులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేసి చూపించారని కితాబిచ్చారు.
సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు వరుస కార్యక్రమాలతో బిజీగా గడిపారు మంత్రి కేటీఆర్. మలక్ పేట ఐటీ టవర్ కి శంకుస్థాపన చేసిన అనంతరం నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆయన పర్యటించారు. అక్కడ నిర్మాణం పూర్తయిన ఐటీ టవర్లను ప్రారంభించారు. టైర్-2 పట్టణాలకు వేగంగా ఐటీరంగాన్ని విస్తరిస్తున్నామని, అక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు ఇది ఉత్తమ మైన మార్గం అని చెప్పారాయన. ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు కేటీఆర్.
శిఖండి రాజకీయాలు..
ప్రతిపక్షాలవి శిఖండి రాజకీయాలని, తమవి సీదా రాజకీయాలని అన్నారు మంత్రి కేటీఆర్. హస్తం పార్టీ ఎక్స్ పైర్ అయిపోయిందని, వారికే నో గ్యారెంటీ అని, ఇక వారిచ్చే గ్యారెంటీలకు దిక్కేముందని ప్రశ్నించారు. మోదీ అబద్ధాలకు హద్దూపద్దూ లేదని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ మాటలు నమ్ముదామా? ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? అంటూ రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో చెణుకులు విసిరారు కేటీఆర్.
కోతలరాయుడు కోమటిరెడ్డి
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోతల రాయుడని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. నల్గొండలో ఆయన చేయలేని పనులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేసి చూపించారని కితాబిచ్చారు. నల్గొండలో ప్రారంభించుకున్న ఐటీ హబ్ అత్యద్భుతమన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజి అతి త్వరలో ప్రారంభం కాబోతుందన్నారు. ఉదయ సముద్రం, తీగెల వంతెన, వరద నీటి కాలువలు, ఇంకా ఎన్నో పనులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు కేటీఆర్. కేసీఆర్ హయాంలో కరెంటు పోతే వార్త అని.. కాంగ్రెస్ హయాంలో కరెంటు వస్తే వార్త అన్నారు. ఫ్లోరోసిస్‌ను తరిమేసిన మగాడు దేశంలో కేసీఆర్ మాత్రమేనన్నారు. మోదీ సైతం ఒప్పుకున్న నిజం ఇదేనన్నారు కేటీఆర్.
సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డికి డిపాజిట్ రాదంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఎవరికి డిపాజిట్ రాదో తేల్చుకుందామన్నారు. ఎన్ని ఎత్తులు, కుట్రలు చేసినా.. జగదీష్ రెడ్డి విజయాన్ని ఆపలేరని, ఆయన విజయం పక్కా ఖరారై పోయిందని చెప్పారు. ముసలినక్క కాంగ్రెస్ పనైపోయిందని, కాంగ్రెస్ కి ఓటేస్తే గొర్రెల మందకు తోడేలుని కాపలా పెట్టినట్టేనన్నారు కేటీఆర్.