ఇది మొండిచెయ్యి.. అది చెవిలో పువ్వు
రైతు బంధు కేసీఆర్ కావాలా? రాబందు కాంగ్రెస్ కావాలా? ప్రజలే ఆలోచించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్.
మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్ విపక్షాలపై మరోసారి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ని మొండిచెయ్యి పార్టీ అని, బీజేపీని చెవిలో పువ్వు పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. 60 ఏళ్లు కరెంటు, నీళ్లు ఇవ్వకుండా చావగొట్టిన కాంగ్రెస్, అలవిగాని హామీలతో ఆరు గ్యారంటీలు ఇస్తోందని విమర్శించారు. 150 ఏళ్ల కాంగ్రెస్ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని సెటైర్లు పేల్చారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు కేటీఆర్.
పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే 3 గంటల కరెంటు గ్యారంటీ అన్నారు కేటీఆర్. ఏడాదికి ఒక ముఖ్యమంత్రి రావడం గ్యారంటీ అని, ఆకాశం నుంచి పాతాళం వరకు కుంభకోణాలు జరగడం గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. వీటిలో కాంగ్రెస్ గ్యారెంటీ ఇస్తుందని, అభివృద్ధిలో గ్యారెంటీ ఇచ్చేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు.. కష్టాలు అని, బీఆర్‌ఎస్ అంటే సాగునీళ్లు.. సంక్షేమం అని చెప్పారు కేటీఆర్.
మిషన్ భగీరథ (అర్బన్) కార్యక్రమం ద్వారా మందమర్రి మున్సిపాలిటీలో త్రాగు నీటి సరఫరాను పురపాలక శాఖ మంత్రి @KTRBRS నేడు ప్రారంభించారు. pic.twitter.com/yOj4l7vP6R
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 1, 2023
రైతుబంధా..? రాబందా..?
రైతు బంధు కేసీఆర్ కావాలా? రాబందు కాంగ్రెస్ కావాలా? ప్రజలే ఆలోచించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. మోదీ ఎన్ని చెప్పినా తొండి అని, ప్రధాని మనసులో తెలంగాణపై ప్రేమ లేదన్నారు. రాష్ట్రానికి ఆయన రావడమే తప్ప ఇచ్చిందేమీ లేదని విమర్శించారు కేటీఆర్.
మంత్రి అయితే మరిన్ని పనులు..
మంత్రులుగా ఉన్నవాళ్లు చేయలేని పనులను కూడా చెన్నూరు ఎమ్మెల్యేగా బాల్క సుమన్ చేసి చూపించారని ప్రశంసించారు మంత్రి కేటీఆర్. భవిష్యత్‌లో సుమన్ మంత్రి అయితే ఇంకా అద్భుతాలు చేస్తారన్నారు. ఓయూ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుమన్.. ఎన్నికల్లో బాహుబలిని ఎదుర్కొని విజయం సాధించారని చెప్పారు.