ఎవరి స్టీరింగ్ ఎవరి చేతుల్లో.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైటెక్ సిటీ వద్ద ఉన్నట్టుగానే.. మలక్ పేట్ మెట్రో నుంచి ఐటీ పార్క్ వరకు స్కైవాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. 25వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంటుందని వైరి వర్గాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎప్పుడూ కేసీఆర్ చేతుల్లోనే ఉంటుందని, ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. అయితే బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతుల్లో ఉందని, ప్రధాని మోదీ చేతుల్లో లేదని సెటైర్లు పేల్చారు. మలక్ పేట ఐటీ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మూడేళ్లలో పూర్తిచేస్తాం..
మలక్ పేటలోని ప్రభుత్వ క్వార్టర్స్ లో ఈ ఐటీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు. రూ.1032 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం ప్రారంభమైంది. 11 ఎకరాల స్థలంలో 21 అంతస్తుల ఈ భవనానికి ‘ఐ టెక్ న్యూక్లియస్’గా పేరు పెట్టారు. మూడేళ్లలో ఈ బిల్డింగ్ పూర్తవుతుందని చెప్పారు మంత్రి కేటీఆర్. ప్రముఖ కంపెనీల కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారాయన.
Minister @KTRBRS speaking after laying foundation stone for IT Tower in Malakpet, Hyderabad https://t.co/aAAKVQGArD
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 2, 2023
మెట్రోనుంచి ఐటీ పార్క్ వరకు స్కై వాక్..
హైటెక్ సిటీ వద్ద ఉన్నట్టుగానే.. మలక్ పేట్ మెట్రో నుంచి ఐటీ పార్క్ వరకు స్కైవాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ పార్క్ ఉంటుందని, అందులో ఐదున్నర లక్షల చదరపు అడుగుల మేర ఐటీ కార్యాలయాలు ఉంటాయని, మిగతా స్థలంలో నాన్ ఐటీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. 25వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
పిక్చర్ అభీ బాకీహై..
రెండేళ్లుగా బెంగళూరు కంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఐటీ ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హరియాణాను అధిగమించామని చెప్పారు. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం పూర్తి చేశామని, కాళేశ్వరంకు కేంద్రం ఒక్క రూపాయి కూడా నిధులివ్వలేదని చెప్పారు. మూసీ ఆధునికీకరణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణలో గత 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, సినిమా ఇంకా మిగిలి ఉందని చెప్పారు కేటీఆర్.
♦