ఫ్లోరైడ్ బాధితుడి ఇంట్లో కేటీఆర్ భోజనం..
ఫ్లోరైడ్ సమస్యను తీర్చడంతోపాటు, వ్యక్తిగతంగా తమ కుటుంబానికి కేటీఆర్ ఎంతో సాయం చేశారని ఉద్వేగానికి గురయ్యారు అంశాల స్వామి. ఆనాడు తమకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు.

మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాలస్వామి ఇంటికి వెళ్లారు మంత్రి కేటీఆర్. ఆ ఇంట్లో ఆయన భోజనం కూడా చేశారు. స్వామి కుటుంబ సభ్యులతో కలసి నేలపైనే కూర్చొని భోజనం చేశారు కేటీఆర్. నేరుగా మంత్రి తమ ఇంటికి రావడం, ఆయన వెంట టీఆర్ఎస్ నేతలు వచ్చి భోజనం చేయడంతో అంశాల స్వామి కుటుంబం ఉబ్బితబ్బిబ్బయింది. ఆనాడు తమకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంది. ఫ్లోరైడ్ సమస్యను తీర్చడంతోపాటు, వ్యక్తిగతంగా తమ కుటుంబానికి కేటీఆర్ ఎంతో సాయం చేశారని ఉద్వేగానికి గురయ్యారు అంశాల స్వామి.
గతంలోనే ఆర్థిక సాయం..
మునుగోడులో ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువగా ఉండేవారు. అదంతా గతం, ఇప్పుడు ఇంటింటికీ సురక్షితమైన నల్లా నీరు రావడంతో ఆ సమస్య దాదాపుగా లేకుండా పోయింది. అయితే అప్పట్లో ఫ్లోరైడ్ బాధితుల సమస్యలను కళ్లారా చూసిన కేటీఆర్.. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం అన్వేషించడంతోపాటు.. బాధితులకు వ్యక్తిగతంగా అండగా నిలిచారు. అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని ఆయనకు ఆర్థిక సాయం కూడా చేశారు. ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ఐదున్నర లక్షల రూపాయలు ఇప్పించారు. మిగిలిన ఇంటి నిర్మాణాన్ని స్వయంగా తన కార్యాలయం ద్వారా పర్యవేక్షించారు కేటీఆర్. కేటీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ అంశాల స్వామి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించారు.







మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత అకస్మాత్తుగా అంశాల స్వామి ఇంటికి వెళ్లారు కేటీఆర్. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వహిస్తున్నానని కేటీఆర్ కి చెప్పారు అంశాల స్వామి. షాపు ఎలా జరుగుతోందని అడిగారు కేటీఆర్. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. మంత్రి కేటీఆర్ రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.