ఆస్క్ కేటీఆర్.. ఆసక్తికర సమాధానాలు..
ఇటీవల కేటీఆర్ ని చాలామంది సినీ హీరోలా ఉన్నారంటూ పొగడ్తల్లో ముంచెత్తిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వలేదు కేటీఆర్.
ఇటీవల కాలి గాయంతో రెస్ట్ తీసుకుంటున్న మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో నెటిజన్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఏర్పాటు చేశారు. #AskKTR అంటూ ఆయన నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఆహ్వానించారు. వాటికి ఆసక్తికర సమాధానాలిచ్చారు. ముందుగా ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు నెటిజన్లు. నా ఆరోగ్యం బాగానే ఉంది, నేను బాగున్నాను బ్రదర్ అంటూ ఉత్సాహంగా సమాధానమిచ్చారు కేటీఆర్. ఇక సహజంగా నెటిజన్ల నుంచి ప్రతిసారి ఎదురయ్యే ప్రశ్నే ఈసారి కూడా వచ్చింది. తెలంగాణకు నెక్స్ట్ సీఎం మీరేనా అని నెటిజన్లు ప్రశ్నించారు. దీనికి కూల్ గా సమాధానమిచ్చారు కేటీఆర్. కేసీఆర్ రూపంలో సమర్థుడైన సీఎం మనకు ఉన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన హ్యాట్రిక్ కొడతారు అంటూ క్లారిటీ ఇచ్చారు.
Empty vessels make lots of noise https://t.co/C1Zt8x7RAE
— KTR (@KTRTRS) August 5, 2022
బీజేపీ నేతల్ని ఖాళీ గిన్నెలతో పోలుస్తూ సెటైర్లు వేశారు కేటీఆర్. బీజేపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతుంటే టీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు 'ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ' అంటూ సమాధానమిచ్చి బీజేపీ నేతల్ని ఎద్దేవా చేశారు. యువత రాజకీయాల్లోకి రావొచ్చా అని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా రావాలని సమాధానమిచ్చారు కేటీఆర్. మన సీఎం కేసీఆర్ కి కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. సెక్రటేరియట్ దసరాకు సిద్ధమవుతుందని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు కేటీఆర్.
Been a while; Let's do a live chat session today at 4PM
— KTR (@KTRTRS) August 5, 2022
Please send in your tweet with #AskKTR
సినిమాల్లోకి వస్తారా..?
మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఉంది ఏమైనా అవకాశం ఉందా అని మరో నెటిజన్ పరోక్షంగా సినిమాల గురించి అడిగారు. ఇటీవల కేటీఆర్ ని చాలామంది సినీ హీరోలా ఉన్నారంటూ పొగడ్తల్లో ముంచెత్తిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వలేదు కేటీఆర్. ఇప్పటి వరకూ నా రాజకీయ ప్రసంగాలను చూడకపోతే 'బిగ్‌స్క్రీన్'పై చూడొచ్చు అని హ్యూమరస్ టచ్ ఇచ్చారు. ప్రధానికి ప్రోటోకాల్ మర్యాదలివ్వలేదని అడిగిన మరో ప్రశ్నకు.. ప్రొటోకాల్ ను తాము స్పష్టంగా పాటించామని, ప్రైవేటు విజిట్ లకు వచ్చిన ప్రధానిని సీఎం సాదరంగా ఆహ్వానించాల్సిన అవసరం లేదని చెప్పారు. సామాజిక మాధ్యమాలలో ప్రొఫైల్ పిక్ మారిస్తే ఏం జరుగుతుంది? జీడీపీ మారితేనే దేశం ముందుకు వెళ్తుందని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు కేటీఆర్.
భారత్ లాంటి దేశంలో సమతుల్యత అనేది అవసరం. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరిస్తే రాయితీలు పొందే రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణ విషయంలో '10 మినిట్స్ - 10 ఏఎం' అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణలో క్రీడలకు తగినంత ప్రాధాన్యతనిస్తున్నామని కూడా చెప్పారు కేటీఆర్. అన్ని జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించాం బ్రదర్ అంటూ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు కేటీఆర్.