పోలింగ్ డే.. హాలిడే అనుకోవద్దు
తమవల్ల కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చని, కానీ తమ చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. అంకితభావంతో సేవలందిస్తున్న బీఆర్ఎస్ ని ప్రజలు భుజం తట్టి ప్రోత్సహించాలన్నారు కేటీఆర్.
పోలింగ్ డే ని హాలిడే అనుకోవద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఆరోజు ఆఫీస్ లకు సెలవు ఇస్తారు కాబట్టి ఇంటికి పరిమితం అవుతారని, ఈసారి మాత్రం అలా చేయొద్దని కోరారు. ఆఫీస్ లకు సెలవు ఇస్తే, ఇంటికి పరిమితమై సినిమాలు చూడొద్దని, బయటకు వచ్చి కచ్చితంగా ఓటు వేయాలని కోరారు. ఈసారి పోలింగ్ శాతం మరింత పెరగాలన్నారు మంత్రి కేటీఆర్.
అర్బన్ ఓటింగ్ పై బీఆర్ఎస్ దృష్టి..
బీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలు లాభపడ్డాయి. ఐటీ, పరిశ్రమల అభివృద్ధి, మౌలిక వసతుల రూపకల్పనతో అర్బన్ జనాభాకు మేలు జరిగింది. అయితే అర్బన్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. ఈసారి అలా కాకూడదని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అందులోనూ గత కార్పొరేషన్ ఎన్నికల్లో అర్బన్ ఓటర్ల తీర్పు బీఆర్ఎస్ ని ఆలోచనలో పడేసింది. అందుకే ఈసారి ఆ ఓటింగ్ పై కూడా దృష్టిపెట్టారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన అభిృవృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అర్బన్ ఓటర్లు తమకు అండగా నిలబడాలన్నారు.
2014లో 3.23 లక్షలున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 10లక్షలకు చేరుకుందని, ఒక ఐటీ ఉద్యోగం పరోక్షంగా నలుగురికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు మంత్రి కేటీఆర్. నగరానికి ఎన్నో చేసినా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పారాయన. తమవల్ల కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చని, కానీ తమ చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. అంకితభావంతో సేవలందిస్తున్న బీఆర్ఎస్ ని ప్రజలు భుజం తట్టి ప్రోత్సహించాలన్నారు కేటీఆర్.