మత రాజకీయం మినహా మోదీ చేసిందేంటి..? -కేటీఆర్
మతం పేరుతో రాజకీయాలు చేసే నాయకుల మాటలు పట్టించుకోవద్దని, హిందూ-ముస్లిం అనగానే ఆగం కావొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిపథంలో నడుస్తుంటే.. ఎనిమిదేళ్ల మోదీ హయాంలో దేశం తిరోగమిస్తోందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. దేవుడి పేరు చెప్పి రాజకీయం చేసే బీజేపీ.. మత రాజకీయాలతో విద్వేషాలు రెచ్చగొడుతోందని చెప్పారు. మతం పేరుతో రాజకీయాలు చేసే నాయకుల మాటలు పట్టించుకోవద్దని, హిందూ-ముస్లిం అనగానే ఆగం కావొద్దని కేటీఆర్ సూచించారు. కులం, మతం పేరుతో చేసే రాజకీయాలపై నాయకుల్ని ప్రజలు నిగ్గదీయాలని, అభివృద్ధికోసం ప్రశ్నించాలని కోరారు. ఆవేశపడకుండా.. ఎనిమిదేళ్ల కాలంలో ఎవరెవరు ఏం చేశారనేది ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు కేటీఆర్.
తెలంగాణకు వీసమెత్తు సాయం కూడా మోదీ చేయలేదన్నారు కేటీఆర్. కాళేశ్వరానికి, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదన్నారు. అభివృద్ధి అంటే ఏంటో సిరిసిల్లలో ఏ గల్లీలో తిరిగినా తెలుస్తుందని చెప్పారు. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. మోదీ నేరుగా తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. కనీసం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదన్నారు. నేతన్నలకు, రైతులకు, విద్యార్థులకు మోదీ ఏం చేశారని ప్రశ్నించారు.
మాట్లాడితే దేవుడి పేరెత్తి రాజకీయం చేసే కరీంనగర్ ఎంపీ.. కనీసం ఆ దేవుడికి ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు కేటీఆర్. వేములవాడ గుడికి ఏమిచ్చారని అడిగారు. అధికారంలోకి వచ్చేందుకు ఇంటింటికీ కుళాయి, ప్రతి ఒక్కరికీ ఇల్లు, ఉద్యోగాలు అంటూ కబుర్లు చెప్పిన మోదీ.. ఇప్పుడు కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలో ఉన్నవారిని ప్రజలు ప్రశ్నించాలని కోరారు. మేలు చేయకపోగా.. నేతన్నలపై జీఎస్టీ భారం మోపి మోదీ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు కేటీఆర్. సిరిసిల్లలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.