Telugu Global
Telangana

మోడీ వల్ల ఈ దేశంలో బాగుపడింది అదానీ మాత్రమే : మంత్రి కేటీఆర్

ప్రధాని మోడీ దేవుడని బండి సంజయ్ అంటున్నారు. మోడీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? అని కేటీఆర్ ప్రశ్నించారు.

మోడీ వల్ల ఈ దేశంలో బాగుపడింది అదానీ మాత్రమే : మంత్రి కేటీఆర్
X

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఈ దేశంలో బాగుపడింది అదానీ ఒక్కరే అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం.. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలిస్తాం.. జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు సంపదనంతా ఒక్కడి ఖాతాలోనే వేసిందని దుయ్యబట్టారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టేదే మోడీ ప్రభుత్వమని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ప్రజల పన్నులతోనే హైవేలు నిర్మిస్తున్నామని చెస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరి టోల్ ఫీజులు ఎందుకు వసూలు చేస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ప్రధాని మోడీ దేవుడని బండి సంజయ్ అంటున్నారు. మోడీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? గిరిజనుల రిజర్వేషన్లు తొక్కిపెట్టినందుకా? నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతూ 700 మంది చనిపోయినా చలించనందుకా? చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించినందుకా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

మోడీ చేసిన అప్పులు ఆకాశంలో ఉంటే.. రూపాయి విలువ పాతాళంలో ఉందని ఇందుకేనా మోడీని దేవుడనేదని ఎద్దేవా చేశారు. గత 14 మంది ప్రధానులు చేయని అప్పు.. మోడీ ఒక్కరే చేశారని కేటీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ ఎప్పుడూ మతపరంగా రెచ్చగొట్టడం తప్పితే కరీంనగర్ జిల్లాకు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ట్రిపుల్ ఐటీలు, పరిశ్రమలు, కేంద్ర విద్యా సంస్థలు ఏవైనా సంజయ్ కారణంగా వచ్చాయా అని కేటీఆర్ అన్నారు. గుజరాతీల చెప్పులు నెత్తిన పెట్టుకున్న వ్యక్తికి తెలంగాణ ఆత్మాభిమానం ఎక్కడ ఉంటుందని ఎద్దేవా చేశారు.

ఈటల రాజేందర్ హామీలు ఏమయ్యాయి?

హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగి 14 నెలలు అయ్యింది. అప్పట్లో తనను గెలిపిస్తే రూ.3వేల పెన్షన్ ఇప్పిస్తా, హోం మంత్రి అమిత్ షాను తీసుకొచ్చి నిధుల వరద పారిస్తా అని హామీ ఇచ్చారు. ఇప్పటికి 14 నెలలు గడిచాయి. మరి ఈటల ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. గత 14 నెలలుగా హుజూరాబాద్‌లో అసలు ఏం అభివృద్ధి జరిగిందో చూపించాలని అన్నారు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని ఈటల రాజేందర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈటల అనే వ్యక్తిని అందరికీ పరిచయం చేసింది కేసీఆర్ కాదా అని మంత్రి అన్నారు.

2004లో హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ కోసం 33 మంది పోటీ పడితే కేసీఆర్ మాత్రం ఈటలకు అవకాశం ఇచ్చిన విషయం మరిచిపోయారా అని అన్నారు. ఈటలకు రాజకీయ జన్మనిచ్చిందే కేసీఆర్ అని.. ఆయన వ్యవహారం మాత్రం మాత్రం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉందన్నారు. తండ్రిలాంటి కేసీఆర్‌ను పట్టుకొని.. ఆయన పాలన రాష్ట్రానికి అరిష్టమని ఈటల ఎలా మాట్లాడగలుగుతున్నాడని అన్నారు. ఎవరి పాలన ఈ దేశానికి అరిష్టమో ఈటల ఒకసారి ఆలోచించుకోవాలని కేటీఆర్ అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ పేరు మాత్రమే బీఆర్ఎస్‌గా మారింది. అంతే కాని పార్టీ గుర్తు, రంగు, జెండా, ఎజెండా, డీఎన్ఏ మారలేదని కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి చెప్పారు.



First Published:  31 Jan 2023 7:10 PM IST
Next Story