Telugu Global
Telangana

దుర్మార్గులు, అసమర్థులు.. ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వజం

50ఏళ్లు అధికారమిస్తే ఏమీ చేయని దుర్మార్గులు, పదేళ్లు కేంద్రంలో అధికారమిచ్చినా హైదరాబాద్ కి ఏమీ చేయని అసమర్థులు మళ్లీ ద్రోహం చేయాలనుకుంటున్నారని.. కులం, మతం పేరు చెప్పి ఓట్లు అడగడానికి వస్తున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజలు పనిచేసే నాయకుడు, పనికొచ్చే నాయకుడినే ఎన్నుకోవాలని సూచించారు.

దుర్మార్గులు, అసమర్థులు.. ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వజం
X

తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధికి అసలైన పునాది వేసుకుని ఇప్పుడు మనం కీలక దశలో ఉన్నామని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. ఈ దశలో పొరపాట్లు చేయకూడదని ప్రజలకు సూచించారు. పొరపాటు చేస్తే తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లిపోతుందని, హైదరాబాద్ మళ్లీ కర్ఫ్యూలకు నిలయంగా మారుతుందన్నారు. అలా జరగకూడదంటే, నిరంతర అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ ని హ్యాట్రిక్ సీఎం చేయాలన్నారు. మరోసారి బీఆర్ఎస్ ని ఆశీర్వదించాలని కోరారు. హైదరాబాద్ లో నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన ఆయన ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.

50ఏళ్లు అధికారమిస్తే ఏమీ చేయని దుర్మార్గులు, పదేళ్లు కేంద్రంలో అధికారమిచ్చినా హైదరాబాద్ కి ఏమీ చేయని అసమర్థులు మళ్లీ ద్రోహం చేయాలనుకుంటున్నారని.. కులం, మతం పేరు చెప్పి ఓట్లు అడగడానికి వస్తున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజలు పనిచేసే నాయకుడు, పనికొచ్చే నాయకుడినే ఎన్నుకోవాలని సూచించారు.

కోర్ సిటీ డెవలప్ మెంట్..

గతంలో హైదరాబాద్ లో అభివృద్ధి జరిగింది కానీ కోర్ సిటీలో ఎలాంటి పనులు చేపట్టలేదని, బీఆర్ఎస్ హయాంలో మాత్రమే సెంట్రల్ హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు మంత్రి కేటీఆర్. అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ సచివాలయం, అమరుల స్మారకం.. సెంట్రల్ హైదరాబాద్ కి కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయన్నారు. హైదరాబాద్ వచ్చినవారెవరైనా ఇవన్నీ చూసిన తర్వాతే తిరిగి వెళ్లాలనుకుంటున్నారని చెప్పారు కేటీఆర్.


ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జ్ హైదరాబాద్ నగరంలో 20వ ఫ్లైఓవర్ అని చెప్పారు మంత్రి కేటీఆర్. అండర్ పాస్ లు, ఇతర బ్రిడ్జ్ లు అన్నిటితో కలిపితే ఇది 36వ ఫలితంఅన్నారు. స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రాం ద్వారా తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రత్యేక కృషి జరుగుతోందని చెప్పారు కేటీఆర్. కేసీఆర్ కి పెద్దన్నలాగా నాయిని నర్సింహారెడ్డి ఉన్నారని, ముషీరాబాద్ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని, అందుకే ఆయన పేరుని స్టీల్ బ్రిడ్జ్ కి పెట్టామని చెప్పారు.

దక్షిణ భారత దేశంలోనే మొట్ట మొదటి అతి పొడవైన స్టీల్‌ బ్రిడ్జ్‌ గా దీనికి ఇప్పటికే ప్రాముఖ్యత లభించింది. ఎలాంటి భూసేకరణ లేకుండానే ఈ స్టీల్ బ్రిడ్జ్ ని నిర్మించడం విశేషం. కింద మెట్రో రైలు వెళ్తుంది, ఆ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ లో మెట్రోలో వెళ్తూ, కింద ట్రాఫిక్ ని గమనించేవారు ప్రయాణికులు. ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ పై వెళ్తూ.. కింద మెట్రో ప్రయాణాన్ని గమనించే అరుదైన అవకాశం లభిస్తుంది.

బ్రిడ్జ్ ప్రత్యేకతలు..

బ్రిడ్జి పొడవు 2.62 కిలోమీటర్లు..

స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రాం కింద రూ. 450 కోట్ల వ్యయం

నిర్మాణంలో వాడిన ఉక్కు 12, 316 మెట్రిక్‌ టన్నులు

81 స్టీల్‌ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు

100ఏళ్ల మన్నికతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం

ఉపయోగాలు..

స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోతాయి. ఇందిరాపార్క్‌, అశోక్‌ నగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్ లో ట్రాఫిక్‌ సమస్య లేకుండా బాగ్‌ లింగంపల్లి వీఎస్టీ జంక్షన్‌ కు సులభంగా చేరుకోవచ్చు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ రద్దీ తగ్గిపోతుంది.

First Published:  19 Aug 2023 12:50 PM IST
Next Story