Telugu Global
Telangana

18 ఏళ్ల జైలు జీవితం.. మంత్రి కేటీఆర్ చొరవతో విముక్తి

ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ కృషి ఫలించింది. లక్ష్మణ్ కు ఏడేళ్ల జైలు శిక్ష తగ్గింది.

18 ఏళ్ల జైలు జీవితం.. మంత్రి కేటీఆర్ చొరవతో విముక్తి
X

మంత్రి కేటీఆర్ చొరవ ఫలించింది. 18 ఏళ్లపాటు దుబాయ్ జైలులో మగ్గిపోయిన కోనారావుపేట వాసి దుండగుల లక్ష్మణ్ కి ఎట్టకేలకు విముక్తి లభించింది. జైలు నుంచి విడుదలైన లక్ష్మణ్ తెలంగాణ చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు లక్ష్మణ్. వారి కుటుంబ సభ్యులు కూడా మంత్రి చొరవకు కృతజ్ఞత తెలిపారు. కేటీఆర్ లేకపోతే.. లక్ష్మణ్ ఇంకా జైలులోనే మగ్గిపోయి ఉండేవాడని అంటున్నారు.

అసలేం జరిగింది..?

దుండగుల లక్ష్మణ్ 2000 సంవత్సరంలో ఉపాధి కోసం దుబాయ్ వలస వెళ్లాడు. అక్కడే పనిచేస్తుండేవాడు. 2005లో నేపాల్ కి చెందిన ఓ వ్యక్తి హత్య కేసులో లక్ష్మణ్ తో పాటు మరో నలుగురు తెలంగాణవాసుల్ని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురికి పాతికేళ్ల జైలు శిక్ష విధించారు. దుబాయ్ చట్టాల ప్రకారం బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తే నిందితులకు విముక్తి లభిస్తుంది. ఆ పరిహారాన్ని దియ్య మనీ అంటారు. కానీ పేద కుటుంబాలకు చెందినవారికి దియ్య మనీ చెల్లించేంత స్థోమత లేదు. పైగా కుటుంబ సభ్యులు తెలంగాణలో ఉన్నారు, బాధితులు నేపాల్ లో, నిందితులు దుబాయ్ లో ఉన్నారు. దీంతో వారు తమకి విముక్తి దొరకదని ఆందోళన చెందారు. అయితే మంత్రి కేటీఆర్ చొరవ తీసుకున్నారు. నేపాల్ లో ఉన్న బాధితుల కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చెల్లించారు. అయితే హత్యానేరం కావడంతో నిందితుల విడుదలకు దుబాయ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు.

ఇటీవల పెట్టుబడుల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ దుబాయ్ వెళ్లినప్పుడు ఈ కేసు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దుబాయ్ లో ఉన్న దౌత్యవేత్తలతో మంత్రి మాట్లాడారు. దుబాయ్ రాజుకి సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్తలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సూచించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది. లక్ష్మణ్ కు ఏడేళ్ల జైలు శిక్ష తగ్గింది. సత్ప్రవర్తన కారణంగా లక్ష్మణ్ ని విడుదల చేస్తున్నట్టు దుబాయ్ అధికారులు తెలిపారు. మిగతా నలుగురు మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు. దుబాయ్ జైలు నుంచి తిరిగొచ్చిన లక్ష్మణ్ ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా ఉన్నాడు.


First Published:  9 Oct 2023 10:55 AM IST
Next Story