Telugu Global
Telangana

మోదీకి ఆస్కార్ కాకపోతే కనీసం బాస్కార్ ఇవ్వాలి – కేటీఆర్

కాంగ్రెస్ హయాంలో డాలర్ తో రూపాయి మారక విలువ పడిపోతున్నప్పుడు మోదీ ఇచ్చిన స్పీచ్ వీడియోని ట్వీట్ చేశారు కేటీఆర్. ఇంతటి నటనా పాఠవం ఉన్న మోదీకి ఆస్కార్ ఇవ్వాలని, ఆస్కార్ కాకపోతే కనీసం బాస్కార్ అయినా ఇవ్వాలన్నారు.

మోదీకి ఆస్కార్ కాకపోతే కనీసం బాస్కార్ ఇవ్వాలి – కేటీఆర్
X

సడన్ గా పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాని గుర్తుచేశారు మంత్రి కేటీఆర్. ఆ సినిమాలో బ్రహ్మానందం ఆస్కార్ తనకు రాదని తెలిసి, తనకు తానే భాస్కర్ అనే అవార్డు ఇచ్చుకుంటారు. భాస్కర్ అనే తన పేరుమీదుగా బాస్కార్ అనే అవార్డు సృష్టిస్తారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీకి ఆస్కార్ ప్లేస్ లో కనీసం బాస్కార్ అయినా ఇవ్వాలంటూ కొత్త చర్చ తీసుకొచ్చారు మంత్రి కేటీఆర్. దానికి కారణం కూడా చెప్పారు. కాంగ్రెస్ హయాంలో డాలర్ తో రూపాయి మారక విలువ పడిపోతున్నప్పుడు మోదీ ఇచ్చిన స్పీచ్ వీడియోని ట్వీట్ చేశారు. ఇంతటి నటనా పాఠవం ఉన్న మోదీకి ఆస్కార్ ఇవ్వాలని, ఆస్కార్ కాకపోతే కనీసం బాస్కార్ అయినా ఇవ్వాలన్నారు కేటీఆర్.

నోబెల్ టు ఆస్కార్..

కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది ప్రధాని మోదీయేనంటూ మునుగోడు ప్రచారంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో మోదీకి వైద్య శాస్త్రంలో నోబెల్ ఇవ్వాలంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ఆ తర్వాత అసలు మోదీకి నోబెల్ ఏ విభాగంలో ఇవ్వాలి అంటూ చిన్న చర్చను మొదలు పెట్టారు కేటీఆర్.

  • కొవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టినందుకు వైద్య శాస్త్రంలో నోబెల్ ఇవ్వాలా..?
  • పెద్దనోట్ల రద్దుతో స్విస్ బ్యాంకుల్లోని బ్లాక్ మనీని వెనక్కి తెచ్చినందుకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ఇవ్వాలా..?
  • రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని అతి కష్టమ్మీద 6గంటలసేపు ఆపినందుకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలా..?
  • రాడార్ థియరీ కనిపెట్టినందుకు ఫిజిక్స్ లో నోబెల్ ఇవ్వాలా..? అంటూ ప్రశ్నలు సంధించారు. పరోక్షంగా మోదీపై సెటైర్లు పేల్చారు.


మోదీకి నోబెల్ అనగానే.. భక్తులకు కోపమొచ్చింది. చాలామంది బీజేపీ నేతలు రియాక్ట్ అయ్యారు. మోదీ, నోబెల్ కి అతీతుడంటూ సమాధానాలిచ్చారు. దీంతో కేటీఆర్ మరో అడుగు ముందుకేశారు. విశ్వగురు మోదీ, నోబెల్ కంటే పెద్ద అవార్డు రావాలని కోరుకుంటున్నవారికోసం అంటూ ఆస్కార్ ని తెరపైకి తెచ్చారు. మోదీ గతంలో రూపాయి పతనం గురించి మాట్లాడిన స్పీచ్ ని జోడిస్తూ.. ఇప్పుడు రూపాయి పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ.. ఆస్కార్ ఇవ్వాలని కోరారు. కనీసం బాస్కార్ కి అయినా మోదీని పరిగణించాలంటూ పరువు తీశారు.

First Published:  17 Oct 2022 11:47 AM IST
Next Story