అవినీతి, అసమర్థతకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ.. - రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్
లక్ష కోట్ల బడ్జెట్ లేని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. అర్థం లేని ఆరోపణలు చేసి ప్రజా క్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతి, అసమర్థతకు కేరాఫ్ అడ్రస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆదివారం ఖమ్మం సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమది బీజేపీ బంధువుల పార్టీ కాదని, మీదే భారత రాబందుల పార్టీ అని విమర్శించారు. ఏఐసీసీ అంటేనే.. అఖిల భారత కరప్షన్ పార్టీ అని తెలిపారు. స్కాములే తాచుపాములై యూపీఏను, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను దిగమింగిన చరిత్ర ప్రజలు మరిచిపోలేదని కేటీఆర్ విమర్శించారు.
మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు..
— KTR (@KTRBRS) July 2, 2023
మీదే భారత రాబందుల పార్టీ
ఏఐసీసీ అంటేనే...
అఖిల భారత కరప్షన్ కమిటీ
All India Corruption Committee
దేశంలో...
అవినీతికి, అసమర్థతకు..
ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్
స్కాములే తాచుపాములై..
మీ యూపీఏను.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను
దిగమింగిన…
బీఆర్ఎస్ అంటే ఢీ టీమ్..
బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదు.. కాంగ్రెస్ పార్టీకి ఏ టీమ్ కాదని.. కాంగ్రెస్, బీజేపీలను ఒంటిచేత్తో ఢీకొట్టే `ఢీ` టీమ్ అని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్‌ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా అని ఆయన మండిపడ్డారు. ఈ మిస్ ఫైరింగ్‌లో ముమ్మాటికీ కుప్పకూలేది కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు.
ఎన్నిసార్లు నవ్వులపాలవుతారు..
లక్ష కోట్ల బడ్జెట్ లేని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. అర్థం లేని ఆరోపణలు చేసి ప్రజా క్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కోరుతున్నది నిర్మాణాత్మక ప్రతిపక్షమని, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదని ఆయన చెప్పారు. భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముడులను విప్పిన `ధరణి` పథకాన్ని ఎత్తివేసి మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని కేటీఆర్ స్పష్టం చేశారు. కర్నాటకలో `అన్నభాగ్య` హామీని గంగలో కలిపి.. ఇక్కడ రూ.4 వేల పింఛను అంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేషన్ బియ్యం ఇవ్వలేని మీరు తెలంగాణకు వచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరని నిలదీశారు.
కర్నాటకలో బీజేపీని ఓడించింది కాంగ్రెస్ కాదు...
కర్నాటకలో బీజేపీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదని, ముమ్మాటికీ అక్కడి ప్రజలేనని కేటీఆర్ చెప్పారు. మరో ప్రత్యామ్నాయం లేకే ఆ ఫలితం వచ్చింది తప్ప అది కాంగ్రెస్ ఘనత, సమర్ధత కానే కాదని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండా మునిగిన పార్టీ కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు. ప్రజల గుండెల నిండా అభిమానం పొందిన పార్టీ బీఆర్ఎస్ అని ఆయన చెప్పారు. తమ తొమ్మిదేళ్ల పాలన వెలుగుల ప్రస్థానమని కేటీఆర్ తెలిపారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలన చీకటి అధ్యాయమన్నారు. బీఆర్ఎస్‌ను జాతీయస్థాయిలో విస్తరిస్తే అంత వణుకెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. జాతీయ రాజకీయాలు మీ జాగీరా అని నిలదీశారు. వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశానికి దొరికిన వజ్రాయుధం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.