Telugu Global
Telangana

ఉత్త చేతులు.. ఉపన్యాసం

గుజరాత్ కి 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయిన ప్రధాని, సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ అనే నినాదాన్ని.. గుజరాత్ కా సాత్, గుజరాత్ కా వికాస్ గా మార్చేశారని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.

ఉత్త చేతులు.. ఉపన్యాసం
X

ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో వెళ్లిపోవడం ప్రధాని మోదీకి అలవాటని, ఇప్పుడు వరంగల్ లో కూడా అదే జరిగిందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రధాని ప్రసంగం అంతా ఆత్మవంచన, పరనింద అన్నట్టుగా కొనసాగిందని చెప్పారు. తెలంగాణకు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలడం ఆయనకు అలవాటేనన్నారు. 9ఏళ్లుగా అడుగడుగునా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, బీజేపీ నిరంకుశ వైఖరిని గుర్తుంచుకొని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు తన్ని తరిమేస్తారని అన్నారు.

గుజరాత్ కా సాత్, గుజరాత్ కా వికాస్

45 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, డిమాండ్ అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే రిపేర్ షాప్ ఏర్పాటు చేయాలనుకోవడం అతి పెద్ద మోసం అన్నారు మంత్రి కేటీఆర్. గుజరాత్ కి 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయిన ప్రధాని, సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ అనే నినాదాన్ని.. గుజరాత్ కా సాత్, గుజరాత్ కా వికాస్ గా మార్చేశారని ఎద్దేవా చేశారు. 15వేలమందికి ఉపాధినిచ్చే బయ్యారం స్టీల్ ప్లాంట్ సహా తెలంగాణలో జాతీయ రహదారి ప్రాజెక్ట్ లు, నూతన రైల్వే లైన్లను పూర్తిగా పక్కనపెట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో బీజేపీకి సరైన గుణపాఠం చెబుతారన్నారు.


దేశానికి గోల్డెన్ పీరియడ్ వచ్చిందంటున్న మోదీ.. యువత కోసం 9 ఏళ్లలో ఏం చేశారో చెప్పి ఉంటే బాగుండేదన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం మోదీ పాలనలో పెరిగిందని, ఉద్యోగాలడిగితే పకోడీలు వేసుకోమంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు కేటీఆర్. లక్షలాది ఉద్యోగాలను అందించే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం, తెలంగాణ యువతకు అన్యాయం చేసిందన్నారు. తెలంగాణలో యూనివర్శిటీలో ఖాళీల భర్తీకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని బీజేపీ నాయకురాలు, ప్రస్తుత గవర్నర్ తమిళిసై తొక్కిపెట్టిన విషయంపై మోదీ స్పందించి ఉంటే బాగుండేదన్నారు కేటీఆర్. తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి మోదీ వ్యాఖ్యల్ని ఖండించారు కేటీఆర్. ఒక్కో గురుకుల విద్యార్థిపై దేశంలోనే అత్యథికంగా ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తమదని అన్నారు. రైతుల ఆదాయాన్ని ఎప్పుడు రెట్టింపు చేస్తారని మోదీని ప్రశ్నించారు. గిరిజన యూనివర్శిటీ పెట్టకుండా ఆదివాసీలకు అన్యాయం చేశారన్నారు కేటీఆర్.

కుటుంబ పాలన, అవినీతి గురించి మోదీ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. బీజేపీ నాయకుల కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రాలేదా అని ప్రశ్నించారు. ఎంతమంది వారసులకు కేబినెట్ పోస్ట్ లు ఇచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా, తెలంగాణ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు కేటీఆర్. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరిపిస్తానన్న ప్రధాని మాటలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అలాంటి ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు కలవరపడే ప్రభుత్వం, నాయకత్వం తమది కాదని స్పష్టంచేశారు.

First Published:  8 July 2023 10:46 AM GMT
Next Story