Telugu Global
Telangana

బీజేపీ పాలనలో నిరుద్యోగ భారతం -కేటీఆర్

తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తూ వారిని రాజకీయాలకు వాడుకొనే కుట్రలకు ఇప్పటికైనా మానుకోవాలంటూ కిషన్‌ రెడ్డికి హితవు పలికారు కేటీఆర్.

బీజేపీ పాలనలో నిరుద్యోగ భారతం -కేటీఆర్
X

TSPSC విషయంలో టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. దేశాన్ని నిరుద్యోగ భారతంగా తయారుచేసిందే బీజేపీ అని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌ రెడ్డికి నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జాప్యానికి కారణమే బీజేపీ అని ధ్వజమెత్తారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసేలా పేపర్‌ లీకేజీకి పాల్పడింది బీజేపీ నేత బండి సంజయ్‌ అనుచరుడేనని చెప్పారు. అలాంటి బీజేపీ నేతలు నిరుద్యోగం గురించి, నియామకాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్.

ఆయన నిస్సహాయ మంత్రి..

కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి కాదని, నిస్సహాయ మంత్రి అని చెప్పారు కేటీఆర్. కేంద్రమంత్రిగా ఉన్న ఆయన ఏనాడైనా విభజన హామీలపై నోరుమెదిపారా? అని ప్రశ్నించారు. తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తూ వారిని రాజకీయాలకు వాడుకొనే కుట్రలకు ఇప్పటికైనా మానుకోవాలంటూ కిషన్‌ రెడ్డికి హితవు పలికారు. ప్రభుత్వరంగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా చేపట్టడంతోపాటు దేశంలోనే ప్రైవేటు రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ అనే విషయాన్ని కిషన్‌ రెడ్డి తెలుసుకోవాలన్నారు కేటీఆర్.

బేరోజ్ గార్ మేళా..

అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని యువతను నమ్మించి మోసం చేసింది మోదీయేనని మండిపడ్డారు కేటీఆర్. భారతదేశం బేరోజ్‌ గార్‌ మేళాగా మారిపోయిందని ధ్వజమెత్తారు. 2014లో మోదీకి దేశప్రజలు ప్రధానిగా ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచే యువతకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఉద్యోగాల విషయంలో మోసం చేసినందుకు యువతకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ కన్నా ఎకువగా ఉద్యోగాలు భర్తీచేసినట్టు చెప్పారు. ఇప్పటికే 1,32,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 90వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా పూర్తికాబోతోందన్నారు కేటీఆర్.

First Published:  1 Nov 2023 7:28 AM IST
Next Story