'ధ్రువ స్పేస్'కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు.. చరిత్ర సృష్టించిన హైదరాబాద్ సంస్థ
ప్రైవేట్ శాటిలైట్‌ను రూందించి, కక్ష్యలోకి పంపించిన తొలి భారత సంస్థగా ధ్రువ స్పేస్ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగానే టీమ్ ధ్రువను కేటీఆర్ అభినందించారు.
హైదరాబాద్‌కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ 'ధ్రువ స్పేస్'ను తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు. ధ్రువ స్పేస్ రూపొందించిన థైబోల్ట్ శాట్-1, థైబోల్ట్ శాట్-2 అనే రెండు ఉపగ్రహాలను ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీ-సీ54 వాహక నౌక ఈ రోజు ఉదయం 11.56కి నింగిలోకి తీసుకొని వెళ్లింది. ఆ రెండు శాటిలైట్లు నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడ్డాయి. దీంతో ధ్రువ్ స్పేస్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు.
ప్రైవేట్ శాటిలైట్‌ను రూందించి, కక్ష్యలోకి పంపించిన తొలి భారత సంస్థగా ధ్రువ స్పేస్ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగానే కేటీఆర్ టీమ్ ధ్రువను అభినందించారు. 'టీమ్ ధ్రువకు నేతృత్వం వహించిన చైతన్య దొర, క్రాంతి మసునూరు, అభయ్ ఎగూర్, కృష్ణ తేజ, సంజయ్ నెక్కంకి నా హృదయ పూర్వక అభినందనలు. ఇది ఎంతో గర్వకారణం. మీకు మా వందనాలు.. మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇవాళ ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్‌ను ప్రయోగించింది. మన దేశానికి చెందిన 1,117 కిలోల బరువు ఉన్న ఓషన్ శాట్-3 ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన ధ్రువ స్పేస్ రూపొందించిన థైబోల్ట్-1, థైబోల్ట్-2, అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థ రూపొందించిన నాలుగు ఆస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలు నింగిలోకి తీసుకెళ్లింది.
ఇక బెంగళూరుకు చెందిన పిక్సెల్ రూపొందించిన ఆనంద్ శాట్‌తో పాటు ఇండియా, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన భూటాన్ శాట్‌ను కూడా నింగిలోకి పంపారు. ఈ 9 ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలో చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. భారత ప్రైవేట్ శాటిలైట్ రూపకర్తలకు ఈ ప్రయోగం పెద్ద బూస్ట్‌ను ఇస్తుందని ధ్రువ స్పేస్ చెబుతోంది. తమ శాటిలైట్లు ఇప్పుడు అంతరిక్షంలో ఉండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించింది.
Heartiest Congratulations Team Dhruva Space led by Chaitanya Dora, Kranthi Musunuru, Abhay Egoor, Krishna Teja & Sanjay Nekkanti
— KTR (@KTRTRS) November 26, 2022
What a proud moment Take a bow and keep soaring high https://t.co/HiPWMKFx7q