కేసీఆర్ రాకముందు కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్త..
400 రూపాయల గ్యాస్ సిలిండర్‌ను 1200కి పెంచిన మోదీ ఈ గట్టున ఉన్నారని, ఆ గట్టున పేదింటి ఆడబిడ్డ లగ్గానికి లక్ష రూపాయలిచ్చిన కేసీఆర్ ఉన్నారని.. ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని సూచించారు కేటీఆర్.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు నారాయణ పూర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్ షో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. సహచర మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డితో కలసి ఆయన రోడ్ షో నిర్వహించారు. వర్షం పడినా కూడా ప్రజలు కేటీఆర్ ప్రసంగం కోసం రోడ్లపైనే వేచి చూశారు. వారందర్నీ చూసి ఉత్సాహంగా ప్రసంగించారు కేటీఆర్. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకొచ్చింది అనే ప్రశ్నతో ప్రసంగం మొదలుపెట్టిన ఆయన.. బీజేపీ విధానాలను ఎండగట్టారు. కేసీఆర్‌కి ముందు ఎలాంటి పరిస్థితులున్నాయి, కేసీఆర్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయో వివరించారు.
గతంలో నారాయణ పూర్ గ్రామంలో రోజుకి 10 గంటలు విద్యుత్ కోత ఉండేదని, కర్మక్రతువులకు బావి దగ్గరకు వెళ్లినవారు 10 నిముషాలు కరెంటు వేయండి అంటూ అధికారుల్ని వేడుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. కేసీఆర్ వచ్చిన తర్వాత 10 నిముషాలు కరెంటు పోయినా స్థానికులు కొంతమంది తనకి ట్విట్టర్లో మెసేజ్‌లు పెడుతుంటారని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తుంటారని చెప్పారు. గతంలో 10 గంటలసేపు కరెంటు పోయినా ఏమీ అనలేకపోయామని, ఇప్పుడు 10 నిముషాలు కరెంటు పోయినా ఉండలేక పోతున్నామని చెప్పారు. కేసీఆర్‌కి ముందు కరెంటు ఉంటే వార్త అని, కేసీఆర్ వచ్చాక కరెంటు పోతే వార్త అని అన్నారు కేటీఆర్.
ఓటర్లు మాంసం ముద్దలు కాదు..
ఓటర్లను సంతలో పశువుల్లా కొనాలని బీజేపీ చూస్తోందని, వారిని కేవలం మాంసం ముద్దలుగా పరిగణిస్తోందని మండిపడ్డారు కేటీఆర్. 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు అవే డబ్బులు పంచి ఓటర్లను మోసగించాలని చూస్తున్నారని చెప్పారు కేటీఆర్. ఇది ప్రజల మీద బలవంతంగా రుద్దబడిన ఎన్నిక అని అన్నారు. మోదీ అహంకారం, రాజగోపాల్ రెడ్డి అహంకారంతో వచ్చిన ఎన్నిక అని చెప్పారు.
ఈ గట్టునుంటారా..? ఆ గట్టునుంటారా..?
400 రూపాయల గ్యాస్ సిలిండర్‌ను 1200కి పెంచిన మోదీ ఈ గట్టున ఉన్నారని, ఆ గట్టున పేదింటి ఆడబిడ్డ లగ్గానికి లక్ష రూపాయలిచ్చిన కేసీఆర్ ఉన్నారని.. ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని సూచించారు కేటీఆర్.
"ఈ గట్టున రేట్లు పెంచిన మోదీ ఉన్నారు.. ఆ గట్టున 200 రూపాయల పింఛన్‌ని రూ.2 వేలకు పెంచిన కేసీఆర్ ఉన్నారు.
ఈ గట్టున చేనేతపై జీఎస్టీ వేసి మరణ శాసనం రాసిన మోదీ.. ఆ గట్టున చేనేత మిత్ర, చేయూత కార్యక్రమాల కేసీఆర్.
ఈ గట్టున బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బేకార్ గాళ్లున్నారు, ఆ గట్టున కారు గుర్తు మీద కూసుకుంట్ల ఉన్నారు..
ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి, ఆగం కాకండి" అని పిలుపునిచ్చారు కేటీఆర్. రైతు బంధు కావాలా రాబందు కావాలా ఆలోచించండి అని అన్నారు.