ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో కాదు.. అసలు సినిమా మేం చూపిస్తాం
నాయిని నరసింహారెడ్డిని పది మంది నిత్యం గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన పేరును ఈ స్టీల్ బ్రిడ్జికి పెట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే సూచించారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
సినిమా థియేటర్లంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గుర్తొచ్చే పేరు ఆర్టీసీ క్రాస్‌రోడ్డు. అక్కడ హిట్ టాక్ వచ్చిందంటే రాష్ట్రమంతా కుమ్మేసినట్టే అని సినీ జనాల మాట. అదే ప్రాంతంలో తాజాగా పర్యటించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తన పొలిటికల్ ప్రసంగానికి సినిమా టచ్ ఇచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కాదు.. ప్రతిపక్షాలకు అసలైన సినిమా తాము చూపిస్తామంటూ కామెంట్ చేశారు.
అందుకే నాయిని పేరు
ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు 2.63 కిలోమీటర్ల దూరం పొడవునా నిర్మించిన స్టీల్‌బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్ దానికి దివంగత మంత్రి, కార్మిక నేత నాయిని నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. వజీర్ సుల్తాన్ టొబాకో (వీఎస్టీ)తో పాటు నగరంలో కొన్ని వందల కార్మిక సంఘాలకు పెద్ద దిక్కుగా నిలిచారు నాయిని నరసింహారెడ్డి. తెలంగాణ ఉద్యమంలోనే కాదు నాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషించారు. అలాంటి నాయిని నరసింహారెడ్డిని పది మంది నిత్యం గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన పేరును ఈ స్టీల్ బ్రిడ్జికి పెట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే సూచించారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
మళ్లీ కేసీఆరే సీఎం
ఇక ముచ్చటగా మూడోసారి తెలంగాణకు కేసీఆరే సీఎం అవుతారని కేటీఆర్ ధీమా ప్రకటించారు. 50 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలినవారు మనకేమీ చేయలేదని పరోక్షంగా కాంగ్రెస్‌కే చురకలు అంటించారు. కులమతాల పేరు చెప్పి అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు సాగనివ్వబోమని చెప్పారు.