Telugu Global
Telangana

మంత్రి కేటీఆర్ వరుస పర్యటనలు.. నేడు వనపర్తిలో శంకుస్థాపనలు

ఈరోజు కేటీఆర్ వనపర్తిలో పర్యటించాల్సి ఉంది. దాదాపు రూ.666 కోట్ల పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

మంత్రి కేటీఆర్ వరుస పర్యటనలు.. నేడు వనపర్తిలో శంకుస్థాపనలు
X

మంత్రి కేటీఆర్ వరుస పర్యటనలతో బిజీ అయ్యారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆయన ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఈరోజు ఆయన వనపర్తిలో పర్యటించాల్సి ఉంది. దాదాపు రూ.666 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం పెద్దపమందడి మండలం బుగ్గపల్లి తండాలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం, రాజపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారు. వనపర్తి పట్టణంలోని సురవరం సాహితీ కళాభవనం, సురవరం ప్రతాప్ రెడ్డి జిల్లా గ్రంథాలయం, ఆధునాతన సమీకృత మార్కెట్, షాదీఖానా, రాక్ గార్డెన్, మట్టి పరీక్షా కేంద్రం, జంతు సంరక్షణ కేంద్రం, వైకుంఠధామం, డంపింగ్ యార్డులను మంత్రి ప్రారంభిస్తారు. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ, ఐటీ హబ్, జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ పునరుద్ధరణ పనులు, బాల బాలికల హాస్టల్స్, వనపర్తి బైపాస్, వనపర్తి- పెబ్బేరు బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రాంగణంలో 50 వేల మందితో బహిరంగ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వరుస కార్యక్రమాలు..

ఈవారంలో మంత్రి కేటీఆర్.. మూసీ నదిపై నిర్మించ తలపెట్టిన ఐదు బ్రిడ్జ్ లకు శంకుస్థాపన చేశారు. టీహబ్ లో విదేశీ కంపెనీ ప్రతినిధుల ప్రత్యేక సమా వేశానికి హాజరయ్యారు. పంజాగుట్టలో వైకుంఠ మహా ప్రస్థానాన్ని ప్రారంభించారు. కూకట్ పల్లి లులుమాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఇదే వారంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లి వచ్చారు మంత్రి కేటీఆర్. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మానేరు వాగుపై నిర్మించే హై లెవల్ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. నిన్న సింటెక్స్, కైటెక్స్ కర్మాగారాల భూమిపూజలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈరోజు మంత్రి వనపర్తిలో పర్యటనకు బయలుదేరుతున్నారు.

అక్టోబర్-4న బాన్సువాడకు..

మంత్రి కేటీఆర్‌ వచ్చే నెల 4న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు వెళ్లాల్సి ఉంది. బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మొత్తమ్మీద వరుస పర్యటనలతో మంత్రి కేటీఆర్ బిజీ అయిపోయారు.

First Published:  29 Sept 2023 8:29 AM IST
Next Story