Telugu Global
Telangana

వరంగల్ లో కేటీఆర్ బిజీ షెడ్యూల్

వరంగల్‌ లో ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆధునిక బస్ స్టేషన్‌ కు భూమిపూజ చేస్తారు. దూపకుంటలో నిర్మించిన 2,200 డబుల్ బెడ్‌ రూం ఇళ్లను కూడా మంత్రి ప్రారంభిస్తారు.

వరంగల్ లో కేటీఆర్ బిజీ షెడ్యూల్
X

వరంగల్​ జిల్లాలో ఈరోజు మంత్రి కేటీఆర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం వరకు ఆయన బిజీ షెడ్యూల్ లో ఉంటారు. వరంగల్‌ లో ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆధునిక బస్ స్టేషన్‌ కు భూమిపూజ చేస్తారు. దూపకుంటలో నిర్మించిన 2,200 డబుల్ బెడ్‌ రూం ఇళ్లను కూడా మంత్రి ప్రారంభిస్తారు. తూర్పు నియోజకవర్గంలో 160 కోట్ల రూపాయలతో నిర్మించిన సిసి, బిటి రోడ్లను మంత్రి కేటీఆర్ ఈరోజే ప్రారంభిస్తారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి ప్రాజెక్ట్ లకు ఆయన శంకుస్థాపన చేస్తారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కార్యక్రమంలో కూడా కేటీఆర్ పాల్గొంటారు.

వరంగల్-ఖమ్మం హైవేని, హైదరాబాద్-భూపాలపట్నం హైవేతో అనుసంధానం చేసేందుకు 13 కిలోమీటర్ల మేర వరంగల్ లో IRR నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.315 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును కాకతీయ అర్బన్ డెవలప్‌ మెంట్ అథారిటీ చేపడుతోంది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పూర్తయింది. ఈ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ IRR పూర్తయితే తూర్పు నియోజకవర్గం అభివృద్ధితోపాటు, వరంగల్‌ లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని అంచనా.

వరంగల్‌ లో రూ.74.50 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం చేపట్టబోతున్నారు. జి ప్లస్ 5 మోడల్‌ తో 3 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించేందుకు కాకతీయ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (KUDA) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏడాదిలోగా గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి ఆర్టీసీకి అప్పగించాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. మిగతా నాలుగు ఫ్లోర్లు వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. ఈ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో కొరియాకు చెందిన యంగ్ వన్ గ్రూప్ ఫ్యాక్టరీలకు కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. యంగ్ వన్ గ్రూప్ రూ.900కోట్ల పెట్టుబడులతో 8 కర్మాగారాలు ఇక్కడ స్థాపించబోతోంది. వీటి ద్వారా 12వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

First Published:  17 Jun 2023 3:01 AM GMT
Next Story