Telugu Global
Telangana

రైతులపై కాంగ్రెస్ కి ఎందుకంత కక్ష..?

రైతులకు ఉచిత కరెంటు ఎందుకని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారుని, 70 లక్షల మంది రైతులు బిచ్చగాళ్లని రేవంత్‌ రెడ్డి అన్నారని.. అసలీ కాంగ్రెస్‌ నేతల తీరుతోనే తెలంగాణలో రైతులు తిరిగి ఆగమవుతున్నారని అన్నారు మంత్రి కేటీఆర్.

రైతులపై కాంగ్రెస్ కి ఎందుకంత కక్ష..?
X

ఉమ్మడి రాష్ట్రంలో కష్టాలను అధిగమించి తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందని చెప్పారు మంత్రి కేటీఆర్. రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ కి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. 24గంటల కరెంటు వద్దంటున్న కాంగ్రెస్ ని ఊరి పొలిమేరల దాకా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కరెంటు కావాలా? కాంగ్రెస్‌ కావాలా? తెలంగాణ రైతులు ఆలోచన చేయాలని చెప్పారు కేటీఆర్.

రైతులకు ఉచిత కరెంటు ఎందుకని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారుని, 70 లక్షల మంది రైతులు బిచ్చగాళ్లని రేవంత్‌ రెడ్డి అన్నారని.. అసలీ కాంగ్రెస్‌ నేతల తీరుతోనే తెలంగాణలో రైతులు తిరిగి ఆగమవుతున్నారని అన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌ పాలనలో బావి వద్ద నిద్రపోయిన రోజులు రైతులు గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కోతలు లేని విద్యుత్‌ సరఫరా ఉండేదా? అని ప్రశ్నించారు.

మోదీ తక్కువ తిన్నాడా..?

మోటర్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ మెడపై మోదీ కత్తి పెట్టారని, అయినా.. మోటార్లకు మీటర్లు పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చే రూ.30వేల కోట్లు వదులుకున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. రైతులపై బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని సాగు చట్టాల ద్వారా తేలిపోయిందని, తెలంగాణలో ఉచిత విద్యుత్ వెసులుబాటు ఉన్న రైతులను ఇబ్బంది పెట్టేందుకే మోటర్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షానే నిలబడిందని వివరించారు కేటీఆర్.

చేరికలు..

మంత్రి కేటీఆర్ సమక్షంలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌ లో చేరారు. పలువురు ఇండిపెండెంట్ నాయకులు, జనసేన నాయకులు గులాబి కండువా కప్పుకున్నారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

First Published:  11 Nov 2023 9:54 PM IST
Next Story