Telugu Global
Telangana

ఇచ్చోడ విద్యార్థినులకు కేటీఆర్ అభినందనలు.. ఎందుకంటే..?

పత్రికల్లో వచ్చిన వార్తను ట్విట్టర్లో షేర్ చేశారు మంత్రి కేటీఆర్. ఇచ్చోడ అమ్మాయిలకు అభినందనలు తెలిపారు.

ఇచ్చోడ విద్యార్థినులకు కేటీఆర్ అభినందనలు.. ఎందుకంటే..?
X

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బాలికల గురుకుల పాఠశాల ఉంది. ఇక్కడ 270మంది విద్యార్థినులు హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారు. ఎకరా స్థలంలో హాస్టల్ ముందే ఖాళీ స్థలం ఉంది. ఆటపాటలకు వినియోగించుకుంటూనే ఇందులో కొంత భాగాన్ని మొక్కలు వేయడానికి అనువుగా చేసుకున్నారు బాలికలు. ఉపాధ్యాయులు, వార్డెన్ల సహకారంతో అక్కడ మొక్కలు నాటారు. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, పూల మొక్కలు అందులో ఉన్నాయి. విశేషం ఏంటంటే.. ఇక్కడి కాయగూరలనే వారి హాస్టల్ లో వంటకు ఉపయోగిస్తున్నారు.

పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లోనే ఇక్కడ కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. ఎలాంటి రసాయనాల ప్రభావం లేదు. ఖర్చు తక్కువ, పైగా తాజా కూరగాయలను ఏరోజు కారోజు వంటకోసం తీసుకెళ్తారు. మొక్కలు నాటే దగ్గర్నుంచి కూరగాయల్న కోసి తీసుకెళ్లే వరకు విద్యార్థులే వంతుల వారీగా తోటపని చేస్తున్నారు. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తను ట్విట్టర్లో షేర్ చేశారు మంత్రి కేటీఆర్. ఇచ్చోడ అమ్మాయిలకు అభినందనలు తెలిపారు.


పిల్లలకు విద్యలో భాగంగా మొక్కల్ని ఎలా పెంచాలి, వ్యవసాయం ఎలా చేయాలి అనేది నేర్పించాలా..? అంటూ మంత్రి కేటీఆర్ మరో ఫొటోని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మీ అభిప్రాయాలు చెప్పండి అంటూ నెటిజన్లను కోరారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం పిల్లలకు విద్యతోపాటు ఆహార పదార్థాలను ఎలా పండిస్తారో కూడా నేర్పాలన్నారు.

ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా పాజిటివ్ న్యూస్ ని కూడా కవర్ చేయాలంటూ జర్నలిస్ట్ లకు సూచించారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో చాలా చోట్ల మంచి పనులు జరుగుతున్నాయని, వాటిని మరింతమందికి దగ్గర చేస్తే ఆ మంచి విస్తృతం అవుతుందన్నారు. ఇచ్చోడ హాస్టల్ పిల్లలు కూరగాయలు పండించడంపై వచ్చిన కథనాలను మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. విద్యార్థినులను అభినందించారు.

First Published:  10 March 2023 10:42 AM GMT
Next Story