Telugu Global
Telangana

పాలమూరులో నాడు మైగ్రేషన్.. నేడు ఇరిగేషన్

కృష్ణా జలాలు ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డి పల్లి వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రి శంకుస్థాపన చేశారు.

పాలమూరులో నాడు మైగ్రేషన్.. నేడు ఇరిగేషన్
X

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతన్నలు అద్భుతాలు సృష్టిస్తున్నారని అన్నారు మంత్రి కేటీఆర్‌. పాలమూరు జిల్లాలో నాడు మైగ్రేషన్.. నేడు ఇరిగేషన్‌ అని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో జిల్లా ముఖచిత్రం మారిపోతుందన్నారు. కృష్ణా జలాలు ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డి పల్లి వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రి శంకుస్థాపన చేశారు.


ప్రత్యామ్నాయాలపై దృష్టి..

వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనమంటే కేంద్రం కొర్రీలు పెడుతోందని విమర్శించారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు ఆయన సూచించారు. ప్రత్యామ్నాయాల్లో ఆయిల్ పామ్ లాభసాటిగా ఉంటుందన్నారు. ఏ పంట వేసినా రైతులు నష్టపోకుండా చూసే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు కేటీఆర్.

వేల టన్నుల నూనెను ప్రస్తుతం మన దేశం దిగుమతి చేసుకుంటోందన్నారు మంత్రి కేటీఆర్. అందుకే ఆయిల్ పామ్ సాగుకి తమ ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తోందన్నారు. 20 లక్షల ఎకరాలకు ఆయిల్‌ పామ్‌ సాగు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అది సాధ్యమైన రోజు.. రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా నూనెలను ఎగుమతి చేయగలుగుతామన్నారు కేటీఆర్. ఆయిల్‌ పామ్‌ సాగుకు పెద్దఎత్తున సబ్సిడీ అందిస్తున్నామని, నెలకు ఎకరానికి రూ.12 వేల చొప్పున ఆదాయం సమకూరుతుందని చెప్పారు కేటీఆర్. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.


First Published:  29 Sept 2023 5:04 PM IST
Next Story