Telugu Global
Telangana

కుటుంబం గురించి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

2014 ఎన్నికల్లో సిరిసిల్లలో ప్రచారం చేస్తూ గజసింగవరం అనే ఊరికి వెళ్లినప్పుడు తనను ఆ ఊరిలోకి రానివ్వలేదని, కాంగ్రెస్ అభ్యర్థి ఊరు కావడంతో బ్యారికేడ్లు పెట్టి మరీ తనను అడ్డుకున్నారని గుర్తు చేశారు కేటీఆర్.

కుటుంబం గురించి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
X

ఫ్యూచర్ ఫార్వర్డ్ తెలంగాణలో భాగంగా నిర్వహించిన ఉమెన్ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని మహిళా శక్తిని కొనియాడుతూ.. తన కుటుంబం గురించి, కుటుంబంలో ఉన్న మహిళల గురించి గొప్పగా మాట్లాడారు. తన తల్లిని చూసి చాలా నేర్చుకున్నానని అన్నారు. తన తండ్రి బిజీగా ఉంటారని, ఆ సమయంలో తనపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు కేటీఆర్. టెన్త్ క్లాస్ లోపు తాను ఏడు స్కూల్స్ మారానని గుర్తు చేసుకున్నారు.


తల్లిదండ్రులు పిలిచి కూర్చోబెట్టి చెబితే ఏ పిల్లలూ వినరని, కాకతాళీయంగా వారినుంచి నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుందన్నారు కేటీఆర్. అలా తన తల్లి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. 14 ఏళ్ల వయసులోనే తన తల్లికి పెళ్లి అయిందని అంత చిన్న వయసులో ఉమ్మడి కుటుంబంలోకి వచ్చి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆమె మారిపోయిందని గుర్తు చేసుకున్నారు.

తన చెల్లి కవిత డైనమిక్‌ లేడీ అని చెప్పారు మంత్రి కేటీఆర్. తన కుటుంబంలోనే ఎక్కువ గట్స్ ఉన్న వ్యక్తి ఆమేనని చెప్పారు. కవిత ధైర్యవంతురాలని అన్నారు. తన భార్యకు చాలా ఓపిక ఉంటుందని చెప్పారు కేటీఆర్. రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఆమె తమ కుటుంబంతో చక్కగా కలసిపోయిందని చెప్పారు. ఇక తన కుమార్తె.. గురించి కూడా గొప్పగా వివరించారు కేటీఆర్. 14 ఏళ్ల తన కుమార్తె 40 ఏళ్ల మహిళ లాగా పరిణితితో ప్రవర్తిస్తుందన్నారు. తెలివైన అమ్మాయని, ఆమెకు సృజనాత్మకత ఎక్కువ అన్నారు. ఇప్పటికే రెండు మూడు పుస్తకాలు రాసిందని, తనకు కూడా ఆమె సలహాలిస్తుందని చెప్పారు. జీవితంలో గోల్ పోస్ట్ అనేది ఉండకూడదని, అది ఉంటే.. అక్కడికి వెళ్లి మనిషి రిలాక్స్ అవుతారని తన కుమార్తె చెప్పేదని గుర్తు చేసుకున్నారు కేటీఆర్.

సంపూర్ణ ప్రత్యేకం..

2014 ఎన్నికల్లో సిరిసిల్లలో ప్రచారం చేస్తూ గజసింగవరం అనే ఊరికి వెళ్లినప్పుడు తనను ఆ ఊరిలోకి రానివ్వలేదని, కాంగ్రెస్ అభ్యర్థి ఊరు కావడంతో బ్యారికేడ్లు పెట్టి మరీ తనను అడ్డుకున్నారని గుర్తు చేశారు కేటీఆర్. అయితే ఆ ఊరికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు సంపూర్ణ.. తన కారు ఆపి మరీ ఆ ఊరిలోకి తీసుకెళ్లిందని చెప్పారు. ఆమె ధైర్యాన్ని తాను మెచ్చుకున్నానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఆమెకు అవకాశమిచ్చానన్నారు కేటీఆర్.

First Published:  19 Nov 2023 9:43 AM GMT
Next Story