నన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.. దీక్షా దివస్ ఘటనలు గుర్తు చేసిన కేటీఆర్
దీక్షా దివస్ రోజున.. ఊరూవాడా ఆ స్ఫూర్తిని తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేసీఆర్ అభిమానులు ఒకరోజు నిరాహార దీక్ష చేపడతారు. కొన్నిచోట్ల ఫొటో ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేస్తారు.
తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం దీక్షా దివస్ అని అన్నారు మంత్రి కేటీఆర్. నవంబర్ 29, 2009 తన జీవితంలో మరచిపోలేని రోజు అని చెప్పారు. దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెంచేందుకు.. కేసీఆర్ నడుం బిగించిన రోజు ఇది అంటూ.. ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆరోజు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఆరోజు తనను జైలులో పెట్టారని అన్నారు కేటీఆర్.
అక్టోబర్ 21, 2009న సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన సభలో కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారని, అప్పుడే ఆయన ఆమరణ నిరాహార దీక్షపై ప్రకటన చేశారని చెప్పారు కేటీఆర్. "రాష్ట్ర సాధనే ధ్యేయంగా.. నవంబర్ 29న సిద్దిపేటలోని రంగధాంపల్లిలో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష కోసం వేదిక సిద్ధమైంది. హైదరాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి, కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్ కు నవంబర్ 28న చేరుకున్నారు. నవంబర్ 29 తెల్లారేసరికి పోలీసులు చుట్టుముట్టారు. కేసీఆర్‌కు రక్షణ కవచంగా నిలిచిన ఉద్యమశ్రేణులు.. పోలీసులను ప్రతిఘటించాయి. పోలీసులు తాత్కాలికంగా వెనక్కితగ్గారు. ఆమరణ దీక్ష చేసేందుకు కేసీఆర్ సిద్దిపేటకు బయలుదేరారు. పోలీసులు గందరగోళం సృష్టించి ఆయనను అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. ఇది తెలిసి ఆచార్య జయశంకర్ ‘‘కేటీఆర్, నేనూ.. మా ఇంటి నుంచే నిరసనకు దిగుతున్నాం’’ అని ప్రకటించారు. ఆ తర్వాత పోలీసులు జయశంకర్ ను ఖమ్మం తీసుకెళ్లారు. నన్ను మాత్రం అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన ఈరోజు.. మలిదశ ఉద్యమంలో లక్ష్యం దిశగా అడుగులేసేందుకు మార్గదర్శకమైంది. ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం" అని కేటీఆర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
దీక్షా దివస్ రోజున.. ఊరూవాడా ఆ స్ఫూర్తిని తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేసీఆర్ అభిమానులు ఒకరోజు నిరాహార దీక్ష చేపడతారు. కొన్నిచోట్ల ఫొటో ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేస్తారు. ఆస్పత్రులు, అనాథాశ్రమాల్లో పండ్ల పంపిణీ, ఇతరత్రా సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సారి మాత్రం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా కార్యక్రమాలు జరగాల్సి ఉంది.