Telugu Global
Telangana

కర్నాటక కష్టాలు మనకు అవసరమా..?

50 ఏళ్లుగా ఏమీ చేయ‌లేని కాంగ్రెస్ మ‌ళ్లీ ఒక్క ఛాన్స్ అంటోందని.. వారి మాయ మాటలు నమ్మి మోసపోతారా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.

కర్నాటక కష్టాలు మనకు అవసరమా..?
X

కర్నాటక కష్టాలు మనకు అవసరమా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌ ను నమ్మి మోసపోయిన కర్నాటక ప్రజలు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారని.. 24 గంటలు కరెంటు కావాలో.. రోజుకి 3 గంటలే కరెంటు కావాలో? ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు రైతులకు దిక్కవుతుందని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటున్న కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

పెద్దపల్లికి చెందిన కాంగ్రెస్‌ నేతలు సత్యనారాయణరెడ్డి, రామ్మూర్తి తెలంగాణ భవన్‌ లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఇంటి పార్టీగా భావిస్తారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని.. విద్యుత్‌, నీటి సమస్యలను పరిష్కరించుకున్నామని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక కచ్చితంగా జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ భరోసా పేరుతో 15 కొత్త కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్.

50 ఏళ్లుగా ఏమీ చేయ‌లేని కాంగ్రెస్ మ‌ళ్లీ ఒక్క ఛాన్స్ అంటోందని.. వారి మాయ మాటలు నమ్మి మోసపోతారా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ కి ఓటు వేసినందుకు కర్నాటక ప్రజలు లెంపలు వేసుకుంటున్నారని, మొసళ్లను తీసుకొచ్చి సబ్ స్టేషన్లో వదిలిపెట్టారని చెప్పారు. కేవలం కరెంటు విషయంలోనే కాదని.. హామీల అమలులో కూడా కర్నాటకలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని అన్నారు. కోరి కోరి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని, ఇంటి పార్టీ బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు కేటీఆర్.

First Published:  25 Oct 2023 10:01 PM IST
Next Story