Telugu Global
Telangana

కాపీ కొట్టింది కాంగ్రెస్సే.. మోదీతో రాజీపడం

అధికారంలో ఉన్నోళ్లు నచ్చకపోతేనే ప్రజలు వేరే పార్టీవైపు చూస్తారని, కానీ ప్రస్తుతం తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు కేటీఆర్. అన్నివర్గాలను సీఎం కేసీఆర్‌ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పారు.

కాపీ కొట్టింది కాంగ్రెస్సే.. మోదీతో రాజీపడం
X

తమ మేనిఫెస్టోని బీఆర్ఎస్ కాపీ కొట్టిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదం అన్నారు మంత్రి కేటీఆర్. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చి, కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ పేరుతో ప్రకటించిందని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్‌ ఇస్తున్న బీఆర్‌ఎస్‌ ను కాదని, 3 గంటల కరెంట్‌ ఇస్తామంటున్న కాంగ్రెస్‌ కు ఎవరైనా ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు కేటీఆర్. మేనిఫెస్టోలో లేని పథకాలను అమలు చేసింది బీఆర్ఎస్, ఉన్న హామీలను అమలు చేయలేనిది కాంగ్రెస్.. అని విమర్శించారు. బడ్జెట్‌ బేరీజు వేసుకునే తాము హామీలు ఇచ్చామని చెప్పారు కేటీఆర్.

డబ్బులు పంచకుండా, మందుపోయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని రేవంత్‌ రెడ్డి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. రాష్ట్రం మొత్తం చూస్తుండగా డబ్బులు పంచిన వ్యక్తి రేవంత్ అని.. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కొడంగల్‌ లో ఓడిపోతే రాజకీయ సన్యాయం తీసుకుంటానని చెప్పి మాట తప్పిన సన్నాసి మాటలు ఎవరైనా ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు. 1989 నుంచి 2018 ఎన్నికల వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 50సీట్లు దాటిన దాఖలాలు లేవని చెప్పారు కేటీఆర్. అప్పట్లో డి.శ్రీనివాస్(డీఎస్‌) ఇంటింటికి తులం బంగారం పంచి ఓడిపోయారని గుర్తు చేశారు.

అధికారంలో ఉన్నోళ్లు నచ్చకపోతేనే ప్రజలు వేరే పార్టీవైపు చూస్తారని, కానీ ప్రస్తుతం తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు కేటీఆర్. అన్నివర్గాలను సీఎం కేసీఆర్‌ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్‌ కు ఓటెయ్యాలో? గాలిమాటలు చెప్పే కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటెయ్యాలో? తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు.

ఎప్పటికైనా దేశానికి ప్రథమ శత్రువు బీజేపీయేనని చెప్పారు మంత్రి కేటీఆర్‌. మోదీ ముందు, బీజేపీ ముందు తాము తలవంచే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్‌వి దింపుడుకల్లెం ఆశలు మాత్రమేనని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు సీట్లు పంచుకునేలోగా తాము స్వీట్లు పంచుకుంటామని తెలిపారు. దేశంలో పేదరికానికి బీజేపీయే కారణమని, ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్న పార్టీ బీజేపీ అని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఔట్‌ డేటెడ్‌ పార్టీ అని, ఇప్పుడు 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని తేల్చి చెప్పారు.

TSPSCలో జరిగిన లోటుపాట్లు సవరించుకుంటామని, మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి కేటీఆర్. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ 24 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తే.. తాము 2,21,000 నియామకాలు చేపట్టినట్టు గుర్తు చేశారు. వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి ఆరున్నర లక్షల మంది పిల్లలకు విద్యను అందిస్తున్నామని, 8వేలమందిని విదేశాలకు పంపి చదివిస్తున్నామని, వారిలో కొందరు ఉద్యోగాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ప్రవళిక ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాలు అవగాహన లేకుండా ఆందోళన చేశాయని మండిపడ్డారు కేటీఆర్.

First Published:  16 Oct 2023 9:05 AM IST
Next Story