మంత్రి కొండా వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి
దసరా పండుగ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య ఫ్లెక్సీ వార్‌తో ధర్మారంలో ఉద్రక్త పరిస్థితులు
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయల మధ్య ఫ్లెక్సీ వార్‌తో ధర్మారంలో ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. దసరా పండుగ సందర్భంగా ధర్మారంలో మంత్రి కొండా వర్గీయులు ఫెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేకపోవడంతో ఆగ్రహించిన ఆయన వర్గీయులు ఫ్లెక్సీలను చింపేశారు. ఈ క్రమంలోనే రేవూరి వర్గీయులపై దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
బాధితుల ఫిర్యాదుల మేరకు కొండా వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కార్యకర్తలను విడుదల చేయాలని మంత్రి వర్గీయులు ఆందోళనకు దిగారు. రేవూరికి వ్యతిరేకంగా వరంగల్-నర్సంపేట ప్రధాన రోడ్డుపై నిరసనకు దిగారు. దీంతో ధర్మారంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఎమ్మెల్యే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ధర్నాతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న మంత్రి కొండా సురేఖ గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ వర్గీయులపై పెట్టిన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కొండా సురేఖ,రేవూరి ప్రకాశ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. రేవూరి ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి సురేఖ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కొండా ఫ్యామిలీకి ఈ నియోజకవర్గంపై పట్టున్నది. ప్రస్తుతం వరంగల్ తూర్పు నుంచి గెలుపొందిన సురేఖ రానున్న రోజుల్లో తన కూతురును ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. తమకు పట్టున్న పరకాల నియోజకవర్గమైతే సేఫ్‌గా ఉంటుందని కొండా దంపతులు యోచిస్తున్నారు. అయితే రేవూరి ప్రకాశ్‌రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యేగా గతంలో గెలిచినా.. ఇటీవల ఎన్నికల్లో అనూహ్యంగా పార్టీ ఆదేశం మేరకు ఆయన పరకాలలో పోటీ చేసి గెలిచారు. దీంతో ఆయన నియోజకవర్గంపై పట్టు సాధించడానికి యత్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇద్దరి నేతల మధ్య కొంతకాలంగా అంతర్గతంగా కోల్డ్‌వార్ నడుస్తున్నదని అక్కడి రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు చివరికి ఫెక్సీ వివాదం చిచ్చుపెట్టింది. దసరా సందర్భంగా పెట్టిన ఫెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేకపోవడంతో ఆగ్రహించారు. ఆయన పేరు పెట్టాలని అల్టిమేటం ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే ఫెక్లీలు చించివేశారు. ఫ్లెక్సీలు చించారని రేవూరి అనుచరులపై కొండా వర్గం దాడి చేసింది. దీంతో కొండా వర్గీయులను పోలీసులు అరెస్టు చేశారు.తాజా ఘటనతో వరంగల్ కాంగ్రెస్‌లో రెండువర్గాలు ఏర్పడాయి. ఫ్లెక్సీ వివాదం రానున్న రోజుల్లో మరెన్నీ మలుపులు తీసుకుంటుందోనని నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నది.