Telugu Global
Telangana

రంగరాజన్‌ను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు.

రంగరాజన్‌ను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ
X

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. ఆయనపై జరిగిన దాడి గురించి ఆమె ఆరా తీశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.సీఎస్ రంగరాజన్‌పై జరిగిన దాడిని మంత్రి సురేఖ తీవ్రంగా ఖండించారు. సంఘవ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం రాముని పేరుతో రాజకీయాలు చేస్తూ, ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణ సమాజాన్ని అశాంతికి గురిచేసే చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తేల్చి చెప్పారు.

ఎంతో ప్రాచీనమైన హిందూ ధర్మంలో ఎవరి నమ్మకాలు వారివని, తమ నమ్మకాలను ఇతరుల పై రుద్దడం వారి స్వేచ్ఛను హరించడమేనని మంత్రి అన్నారు. తన జీవిత పర్యంతం ధర్మానికే కట్టుబడి జీవించిన శ్రీరాముని పేరుతో హింసకు పాల్పడటం విచారకరమని అన్నారు. ఈ దాడికి కారకులైన వారిని చట్టబద్ధంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. కాగా పూజారిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

First Published:  10 Feb 2025 9:02 PM IST
Next Story