Telugu Global
Telangana

శాంతించిన కోమటిరెడ్డి.. అద్దంకి లైన్ క్లియర్ అయినట్టేనా!

ఇటీవల కోమటిరెడ్డిని ప్రత్యేకంగా కలిసి క్షమాపణలు కోరారు. అంతేకాదు తను నటించిన ఇండియా ఫైల్స్‌ సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడంతో.. కోమటిరెడ్డి హాజరయ్యారు.

శాంతించిన కోమటిరెడ్డి.. అద్దంకి లైన్ క్లియర్ అయినట్టేనా!
X

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, అద్దంకి దయాకర్‌ మధ్యం వివాదం గురించి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇద్దరు నేతలు ఓకే వేదికపై కనిపించారు. అద్దంకి దయాకర్‌ నటించిన ఇండియా ఫైల్స్‌ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇదే వేదికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు అద్దంకి దయాకర్. గతంలో జరిగిన వివాదానికి సంబంధించి కోమటిరెడ్డికి వేదికపైనే సారీ చెప్పారు అద్దంకి. కోమటిరెడ్డి సైతం అద్దంకిపై తన కోపాన్ని మరిచిపోయి పొగడ్తల వర్షం కురిపించారు.

ఇంతకీ గతంలో ఏం జరిగిందంటే..?

గతంలో మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తర్వాత మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ టైమ్‌లో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యవహరించిన తీరుపై అద్దంకి మండిపడ్డారు. మునుగోడులో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన అద్దంకి దయాకర్‌.. పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే వెళ్లిపోవాలంటూ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని ఉద్దేశించి ఓ బూతు పదాన్ని వాడారు. దీంతో అప్పటి నుంచి అద్దంకి దయాకర్‌ను కోమటిరెడ్డి టార్గెట్ చేశారని ప్రచారం జరిగింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అద్దంకి దయాకర్‌కు టికెట్‌ దక్కకపోవడాని, ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ.. అద్దంకికి మరే పదవి రాకపోవడానికి కోమటిరెడ్డే కారణమని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో పీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏం చేయలేకపోయారని సమాచారం.


దీంతో గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు అద్దంకి. ఇందులో భాగంగానే ఇటీవల కోమటిరెడ్డిని ప్రత్యేకంగా కలిసి క్షమాపణలు కోరారు. అంతేకాదు తను నటించిన ఇండియా ఫైల్స్‌ సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడంతో.. కోమటిరెడ్డి హాజరయ్యారు. ఇక కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూల్ కావడంతో త్వరలోనే అద్దంకికి పదవీయోగం ఉంటుందన్న వార్తలు జోరందుకున్నాయి.

First Published:  13 July 2024 12:11 PM GMT
Next Story