రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టండి - కోమటిరెడ్డి
రైతుబంధు అడిగితే చెప్పులతో కొడతామంటున్న కాంగ్రెస్ నాయకులను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పులతో కొడతారో, ఓటుతో కొడతారో 70 లక్షల మంది రైతులు నిర్ణయించుకోవాలన్నారు KTR.
రైతుబంధుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైతుబంధు అందక ఇప్పటికే రైతులు నైరాశ్యంలో ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంకా రైతుబంధు పడలేదని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. అలా అన్న వారిని చెప్పుతో కొట్టాలంటూ ఆగ్రహంతో ఊగిపోయారు మంత్రి కోమటిరెడ్డి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతలు, రైతులు మండిపడుతున్నారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్ పార్లమెంటరీ సోషల్‌మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కోమటిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించారు. రైతుబంధు అడిగితే చెప్పులతో కొడతామంటున్న కాంగ్రెస్ నాయకులను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పులతో కొడతారో, ఓటుతో కొడతారో 70 లక్షల మంది రైతులు నిర్ణయించుకోవాలన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న టైమ్‌లో వారం రోజుల్లోగా రైతుబంధు పంపిణీ చేసేవాళ్లమన్నారు కేటీఆర్.
ఇక రైతుబంధుపై మంత్రులు ఒకొక్కరు ఒక మాట చెప్తున్నారు. డిసెంబర్‌లోనే రైతుబంధు పంపిణీకి సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. దాదాపు 40 రోజులు గడిచినప్పటికీ రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. నగదు జమ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకూ కేవలం 2 ఎకరాల 10 గుంటలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు జమ అయింది.