Telugu Global
Telangana

కొత్త మద్యం బ్రాండ్లపై జూపల్లి వింత సమాధానం

సోమ్‌ డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చింది తాను కాదంటూనే ఆ కంపెనీని వెనకేసుకొచ్చారు జూపల్లి. దాదాపు 2 దశాబ్ధాలుగా సోమ్ డిస్టిలరీస్‌ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్యం సరఫరా చేస్తోందని చెప్పుకొచ్చారు.

కొత్త మద్యం బ్రాండ్లపై జూపల్లి వింత సమాధానం
X

తెలంగాణలో సోమ్ డిస్టిలరీస్‌కు చెందిన బీర్ల ఉత్పత్తులను అనుమతించడంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వింత సమాధానం ఇచ్చారు. తెలంగాణలో సోమ్ డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ ఆ పర్మిషన్ ఇచ్చింది తాను కాదన్నారు. జూపల్లి ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సోమ్‌ డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చింది తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అని చెప్పుకొచ్చారు జూపల్లి. దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ దగ్గరకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని, గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హోల్‌సేల్‌ మద్యం బ్రాండ్లకు అనుమతి విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఉంటుందన్నారు జూపల్లి.

సోమ్‌ డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చింది తాను కాదంటూనే ఆ కంపెనీని వెనకేసుకొచ్చారు జూపల్లి. దాదాపు 2 దశాబ్ధాలుగా సోమ్ డిస్టిలరీస్‌ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్యం సరఫరా చేస్తోందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో లిక్కర్, బీర్ల తయారీ, సరఫరా వ్యవస్థను 97.44 శాతం విదేశీ కంపెనీలే ఆక్రమించాయని.. ఇండియాకు చెందిన సోమ్‌ డిస్టిలరీస్‌కు అనుమతి ఇస్తే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు జూపల్లి.

తెలంగాణలో దాదాపు నెల రోజులుగా KF బీర్ల కొరత ఏర్పడింది. అయితే కృత్రిమంగా KF బీర్ల కొరత సృష్టించి తమకు అనుకూలమైన సోమ్‌ డిస్టిలరీస్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‌గతంలో సోమ్‌ డిస్టిలరీస్‌కు చెందిన మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

First Published:  29 May 2024 9:22 AM IST
Next Story